డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ ఎంత సంచలనం సృష్టిస్తోందో, దానిపై మీడియాలో వస్తున్న స్పైసీ కధనాలు, ఊహాగానాలు అంతకంటే సంచలనం సృష్టిస్తున్నాయి. మళ్ళీ ఈ పరిణామాలన్నిటిపై సినీ, రాజకీయ ప్రముఖులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు కూడా కొత్త సమస్యలను, వివాదాలకు దారి తీస్తున్నాయి.
ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న అకున్ సబర్వాల్ ఆయన బృందంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఆరోపణలతో వేడెక్కిన వాతావరణాన్ని వైకాపా ఎమ్మెల్యే రోజా మరికాస్త వేడెక్కించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, “సినిమావాళ్ళ జీవితాలు అద్దాల మేడల వంటివి. ఎవరు రాయి విసిరినా ముందుగా నష్టపోయేది వాళ్ళే. డ్రగ్స్ కేసులో కేవలం సినిమావాళ్ళు ఒకళ్ళే అందరికి కనబడుతున్నారు. రాజకీయాలలో డ్రగ్స్ తీసుకొనేవారు..లేదా వాటితో సంబంధాలున్నవారు ఎవరూ లేరా? మరివారి పేర్లు ఎందుకు బయటకు రావడం లేదు? సిట్ బృందం సినిమా వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేసుకొని దర్యాప్తు చేస్తోంది?
అది చేస్తున్న ఈ విచారణతో సినీపరిశ్రమ పరువుపోయింది. ముఖ్యంగా విచారణకు హాజరవుతున్నవారిలో ఎవరూ దోషులుగా నిర్ధారించబడనప్పటికీ ఈ కేసుల కారణంగా సమాజంలో తలెత్తుకొని తిరుగలేకపోతున్నారు. వారి కుటుంబసభ్యులు ఎంతగా ఆవేదన చెందుతున్నారో ఎవరికీ తెలియదు. వారి జీవితాలు పేకమేడలా కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ కేసుల కారణంగా వారికి జరుగుతున్న నష్టాన్ని, ఆవేదనని సిట్ ఎప్పటికైనా తీర్చగలదా? కనుక ఇప్పటికైనా సిట్ నిష్పక్షపాతంగా, నిజాయితీగా విచారణ జరపాలి. సినిమా వాళ్ళనే కాకుండా మిగిలిన రంగాలలో డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలున్న వారిని కూడా విచారించి తమ నిజాయితీని చిత్తశుద్ధిని, నిరూపించుకోవాలి,” అని రోజా అన్నారు.
ఎమ్మెల్యే రోజా కూడా సినీపరిశ్రమకు చెందినవ్యక్తే కనుక ఆమె ఈవిధంగా స్పందించడం, బాధపడటం సహజమే. అదేవిదంగా రాజకీయాలలో ఉన్నవారికి ఈ డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలు లేని గొప్ప నిజాయితీపరులని అనుకోవడానికి లేదు. కనుక ఆమె చెప్పినట్లు వారిపై కూడా ఎక్సైజ్ శాఖ దృష్టి సారిస్తే మంచిదే. కానీ సినిమావాళ్ళను విచారించడం అంటే వారి జీవితాలతో ఆడుకోవడమే అనే రోజా వాదనను ఎవరూ అంగీకరించలేరు.
ఇటువంటి నేరాలకు, అసాంఘిక పనులకు ఎవరు పాల్పడినా తప్పకుండా వారిని విచారించి దోషులుగా తేలితే శిక్షించాల్సిందే. సినీ, రాజకీయ ప్రముఖులైనంత మాత్రాన్న తాము దీనికి అతీతులమని చెప్పుకొని, తమని విచారించడం తప్పు అన్నట్లు మాట్లాడటం సరికాదు. ఒకవేళ ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నవారందరూ నిర్దోషులుగా తేలితే సిట్ అధికారులే ఆ విషయం ప్రకటిస్తారు కదా. వారు దోషులా కాదా అని నిర్ణయించడానికి రామ్ గోపాల్ వర్మ ఎవరు..రోజా ఎవరు?వారికి ఏ హక్కు ఉంది? కనుక మీడియాతో సహా అందరూ ఎక్సైజ్ శాఖ అధికారులను వారి పని వారిని చేసుకొనిస్తే హైదరాబాద్ నుంచి ఈ మహమ్మారిని తరిమికొడతారు. అకున్ సబర్వాల్ బృందం అంత సమర్ధమైనదేనని ఇప్పటికే నిరూపించుకొంది కూడా.