అధికారంలో ఉన్నవారిని ఏదో కారణం చేత రాజీనామా చేయమని ప్రతిపక్షాలు కోరుతూనే ఉంటాయి. కావాలంటే తాము రాజీనామా చేస్తామని దమ్ముంటే మీరు కూడా రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలని సవాలు విసరడం కూడా మామూలే. అది కొండకు వెంట్రుక ముడేసి లాగే ప్రయత్నమే అని చెప్పవచ్చు.
తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి కూడా అటువంటి కోరికే కోరుతున్నారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక దందాలు చేస్తున్న కేటిఆర్ బంధువులు కొందరు దళితులు, బలహీనవర్గాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కనుక కేటిఆర్ రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ బేషరతుగా దళితులకు క్షమాపణలు చెప్పాలని ఉత్తం కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ క్షమాపణలు చెప్పకపోతే ఈ నెల 26న రాష్ట్రంలో కలెక్టరేట్లను ముట్టడించి తమ నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. ఆ తరువాత 31వ తేదీన సిరిసిల్లాలో బహిరంగ సభ నిర్వహించి తండ్రీకొడుకుల అరాచకాల గురించి ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు. నేరళ్లలో కొందరు దళితులు, బీసిలపై తెరాస నేతలు పిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని, వారిని హింసించిన పోలీసులు, అందుకు కారకులైన తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలని ఉత్తం కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సంఘటనపై దర్యాప్తు చేసి దోషులను తప్పకుండా శిక్షించవలసిందే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దీని నుంచి రాజకీయ మైలేజి పొందాలని చూడటం కూడా తప్పే. ఆ పార్టీ నేతలకు ఆ అభాగులపై జాలి అభిమానం ఉంటే వారికి న్యాయం జరిగేలా పోరాడాలి. కానీ వారి పేరు చెప్పుకొని సభలు నిర్వహించుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వారి సభలు, ధర్నాలకు ముందస్తుగా తేదీలు, వేదికలు ప్రకటించడం గమనిస్తే వారికి ఆ సమస్య పరిష్కరించాలనే తపన కంటే ఆ పేరుత్ ఈ కార్యక్రమాలు పెట్టుకొని ప్రజలలోకి వెళ్ళాలనే తపనే ఎక్కువగా కనబడుతోంది. ప్రజలలోకి వెళ్ళదలిస్తే ఎప్పుడు ఎక్కడ కావాలనుకొంటే అక్కడ బహిరంగ సభ పెట్టుకొని నేరుగానే వెళ్ళవచ్చు కదా మద్యలో దళితులను వాడుకోవడం ఎందుకో?