అకున్ పై ఏమిటా విమర్శలు? ఆ తెగువ మరెవరికైనా ఉందా?

July 25, 2017


img

తెలంగాణా ఎక్సైజ్ శాఖా డైరెక్టర్ అకున్ సబర్వాల్ గత దశాబ్ధకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా కీలకమైన పదవులలో పనిచేసినప్పటికీ ఎప్పుడూ మీడియాకు దూరంగానే ఉండేవారు. అందుకే ఆయన గురించి చాలా మందికి తెలియదు. కానీ డ్రగ్స్ కేసులలో సినీ ప్రముఖులకు నోటీసులు పంపించిన తరువాత హటాత్తుగా అందరి దృష్టిలో పడ్డారు. ఆయనకు ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినా ఏమాత్రం తొణకకుండా తన దర్యాప్తులో ముందుకు సాగడంతో ఆయన ప్రజల దృష్టిలో రియల్ లైఫ్ హీరోగా మారారు. చివరికి రామ్ గోపాల్ వర్మ కూడా ఆయనను బాహుబలితో పోల్చాడు. 

ఇంతకీ అకున్ సబర్వాల్ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు అందరిలో కలుగుతోంది కదా? 

ఆయన పంజాబ్ లోని పాటియాలాలో జన్మించారు. ఆయన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవారు. కనుక తను కూడా తన తండ్రిలాగే దేశసేవ చేయలని అకున్ కలలు కనేవారుట. తండ్రి ఉద్యోగరీత్యా తరచూ బదిలీలు అవుతుంటారు కనుక అకున్ విద్యాభ్యాసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా ప్రాంతాలలో సాగింది. ఆ కారణంగా ఆయనకు చిన్నప్పటి నుంచే భారతదేశం యొక్క భిన్నత్వంలోని ఏకత్వాన్ని ప్రతిబింబించే బాషలు, సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన పెరిగింది. 

ఆయన మొదటి నుంచి లెక్కలలో దిట్ట కానీ మెడిసన్ చదవాలనుకొని డెంటల్ కోర్సు చేసి కొంతకాలం దంతవైద్యుడిగా చేశారు. కానీ ఆ వృత్తి తన ఆశయాలకు చాలా దూరంగా ఉందని గ్రహించిన సివిల్స్ వ్రాసి ఆల్ ఇండియా లెవెల్ ల్లో 33వ ర్యాంక్ సాధించారు.   

శిక్షణా సమయంలోనే అసోంలో తీవ్రవాదులతో తలపడవలసి వచ్చింది. అక్కడ ఆయన చూపిన ప్రతిభా పాటవాలు, పోరాటస్ఫూర్తి కారణంగా మొట్టమొదట పోస్టింగ్ ఫ్యాక్షనిస్టులకు నిలయమైన అనంతపురంలో వచ్చింది. ఆయన అక్కడ ఉన్నంత కాలం ఫ్యాక్షనిస్టుల గొంతు వినబడలేదు. 

అక్కడి నుంచి 2007లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాలో విశాఖకు బదిలీ అయ్యారు. అక్కడ ఆయన మావోయిస్టులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన హయాంలోనే 32 మంది కరడుగట్టిన మావోయిస్టులను మట్టుబెట్టడం జరిగింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక 132మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. 

ఆ తరువాత డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొంది హైదరాబాద్ చేరుకొన్నారు. ఆ సమయంలో తెలంగాణా ఉద్యమాలు చాలా జోరుగా సాగుతున్నాయి. వాటి మద్య హైదరాబాద్ లో విధులు నిర్వహించడం అంటే ఏ పోలీస్ అధికారికైనా కత్తి మీద సాముగానే ఉండేది. అప్పుడు కూడా అకున్ సబర్వాల్ ఎవరినీ నొప్పించక తానొవ్వక అన్నట్లుగా చాలా చాకచక్యంగా విధులు నిర్వహించి అందరి ప్రశంశలు పొందారు.   

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ఏరికోరి ఎక్సైజ్ శాఖకు డైరెక్టరుగా నియమించుకొన్నారు. గత మూడేళ్ళలో గుడంబా, కల్తీసారా తయారుచేసే వారిపై ఆయన పోరాడి రాష్ట్రంలో వాటిని దాదాపు అరికట్టగలిగారు. కానీ ఏనాడు తన పేరు బయటకు రానీయలేదు. ఇప్పుడు కూడా మీడియా దృష్టిలో పడటం ఆయనకు అసలు ఇష్టం లేదు. కానీ సినీప్రముఖులకు నోటీసులు ఇచ్చి వారిని విచారించడం మొదలుపెట్టగానే ఆయన ప్రమేయం లేకుండానే పాపులర్ అయిపోయారు. 

డ్రగ్స్ కేసులో ఆయన చేస్తున్న విచారణ వలన హైదరాబాద్, తెలంగాణాకు, కేసీఆర్ పేరు గంగలో కలిసిపోతోందని రామ్ గోపాల్ వర్మ నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నాడు. కానీ ఆయన ప్రాణాలకు తెగించి మరీ కేసుల దర్యాప్తు సాగిస్తూ రియల్ లైఫ్ హీరో అయ్యేడని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. 

హైదరాబాద్ లో..సినీపరిశ్రమలో డ్రగ్స్ సరఫరా..అలవాటు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ అధికారి ఇంత ధైర్యం చేయలేదు. కానీ అకున్ సబర్వాల్ చేశారు. 

కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తప్పవన్నట్లు నగరంలో నుంచి...రాష్ట్రంలో నుంచి  డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రయత్నిస్తున్న ఆయనపైనే వర్మ వంటివారు విమర్శలు గుప్పిస్తున్నారు. వర్మ కంటికి క్రిమినల్స్, దొంగలు, ఫ్యాక్షనిస్టులు, మాఫియా గ్యాంగ్ లీడర్స్ మాత్రమే హీరోలుగా కనిపిస్తారు తప్ప ఇటువంటి రియల్ లైఫ్ హీరోలు కనబడరని స్పష్టం అవుతోంది. 

అయితే ఇటువంటి కువిమర్శలు చలించేవాడయితే అతను అకున్ సబర్వాల్ కాలేడు. ఈ సందర్భంగా మొన్న ఛార్మీ చేసిన ట్వీట్ ను ఓసారి చెప్పుకోక తప్పదు. ఎవరైనా నీపై అక్కసు పెంచుకొన్నారంటే దానర్ధం...వారికంటే నువ్వు పై స్థానంలో ఉన్నావని! అకున్ సబర్వాల్ కు ఇది అక్షరాల సరిపోతుంది కదా!  



Related Post