కేసీఆర్,తెలంగాణా పరువు పోయింది: వర్మ

July 25, 2017


img

డ్రగ్స్ కేసులో సినీపరిశ్రమకు చెందినవారినే ఎక్సైజ్ శాఖ టార్గెట్ చేసుకొని, తన పాపులారిటీని పెంచుకోవాలని తాపత్రయపడుతోందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేశారు. వాటికి ఆ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్వయంగా గట్టిగా జవాబు చెప్పి తమ దర్యాప్తుకు ఆటంకం కలిగించేవిధంగా ఎవరూ మాట్లాడవద్దని, మాట్లాడితే చర్యలు తప్పవని నిన్ననే వర్మకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు. అయినా రామ్ గోపాల్ వర్మ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. మళ్ళీ మరోసారి అంతకంటే తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు.

ఆయన ట్వీట్స్ ఆయన మాటలలోనే:

“ఈ డ్రగ్స్ కేసుల కంటే పెద్ద కుంభకోణం జరగడం యధార్ధమా కాదా? దాని నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే ఈ డ్రగ్స్ కేసులతో సినీ పరిశ్రమను ముందుకు తీసుకువచ్చిన మాట వాస్తవమా కాదా?”

“ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇంకా అనేక పెద్దతలకాయలున్నాయని వారి పేర్లు బయటకు రాకుండా కాపడుతున్నారని అందరూ అనుకొంటున్నా మాట వాస్తవమా కాదా?”

“ఈ విచారణ పూర్తయిన తరువాత ఆ ఇంటర్వ్యూ వీడియోలను ఎందుకు విడుదల చేయడం లేదు? ఈ కేసులలో ప్రజలకు నిజాలు తెలియవలసిన అవసరం లేదా?”

“అకున్ సబర్వాల్ నేతృత్వంలో సాగుతున్న ఈ సిట్ విచారణ వలన హైదరాబాద్ కు చెడ్డపేరు తప్ప మరే ఫలితం ఉండదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా? అని ముంబైలో ప్రజలు నన్ను అడుగుతున్నారు. ఈ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ పేరిట జరుగుతున్న జాతీయ స్థాయి డ్రామాలో యావత్ తెలంగాణా రాష్ట్రం పేరు ప్రతిష్టలు దెబ్బతినడం తప్ప చివరికి సాధించేది ఏమీ ఉండకపోవచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. పంజాబ్ కంటే తెలంగాణాలోనే ఎక్కువగా డ్రగ్స్ వాదుతున్నారని ముంబైలో ప్రజలు అభిప్రాయపడుతున్నారు.”

“ఒకప్పుడు ముంబై ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను చాలా అభిమానించేవారు. కానీ తెలంగాణాలో ఇప్పుడు బయటపడిన ఈ డ్రగ్స్ వ్యవహారాలు చూసి షాక్ తిన్నారు. బాలీవుడ్ లో..ముంబై, పంజాబ్ స్కూళ్ళలో కూడా హైదరాబాద్ స్కూళ్ళలో జరుగుతున్నట్లు డ్రగ్స్ వాడకం జరుగలేదని వారు అంటున్నారు. అకున్ సబర్వాల్ నేతృత్వంలో సాగుతున్న సిట్ దర్యాప్తుతో హైదరాబాద్, తెలంగాణా ప్రతిష్టకు భంగం కాకూడదని నేను కోరుకొంటున్నాను. వారి బృందం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకొంటున్నాను.”

“బాబుబలి సినిమా రిలీజ్ తో దేశప్రజల దృష్టిలో తెలుగువారి కీర్తి ప్రతిష్టలు ఎంత ఉన్నతస్థాయికి ఎదిగాయో, ఈ అకున్ సబర్వాల్ టీం దర్యాప్తుతో అంతగా దిగజారిపోయాయి.”

“తెలంగాణా ప్రభుత్వం చాలా సమర్ధంగా పనిచేస్తోందని ముంబై ప్రజలు భావించేవారు. కానీ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణా స్కూళ్ళలో డ్రగ్స్ వాడుతున్నారని తెలిసి ముంబై ప్రజలు షాక్ అయ్యారు.”

“ముంబై ప్రజలు ఇంతవరకు కేసీఆర్, తెరాస, తెలంగాణా ప్రభుత్వం గురించి అన్నీ గొప్ప విషయాలే వింటుండేవారు. కానీ అకున్ సబర్వాల్ బృందం పుణ్యమాని వినకూదనివి అన్ని వింటున్నారు. బాహుబలి తెలంగాణా పేరు ప్రతిష్టలకు పరాకాష్ట అనుకొంటే ఈ డ్రగ్స్ స్కాం దాని పేరుప్రతిష్టలను పాతాళానికి దిగజార్చింది. కనుక కేసీఆర్, తెరాస, తెలంగాణా ప్రభుత్వం పరువుకాపాడవలసిందిగా నేను అకున్ సబర్వాల్ కు విజ్ఞప్తి చేస్తున్నాను.” అని ట్వీట్ రామ్ గోపాల్ వర్మ చేశాడు.   



Related Post