పొన్నం భయ్యా...ఎందుకీ హడావుడి?

July 25, 2017


img

కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆగస్ట్ 5వ తేదీ నుంచి కరీంనగర్ లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నట్లు ప్రకటించారు. తెరాస అధికారంలోకి వస్తే కరీంనగర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, కానీ మూడేళ్ళయినా కాలేజీ ఏర్పాటు చేయలేదని అన్నారు. కనుక  ఆగస్ట్ 5లోగా కాలేజీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దిష్ట ప్రకటన చేయాలని లేకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటానని హెచ్చరించారు. 

కరీంనగర్ లో మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు కనుక ఆ హామీని నిలుపుకోవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. అయితే దాని కోసం పొన్నం ప్రభాకర్ నేరుగా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడి ఉంటే ఫలితం ఉండేది. నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన జిల్లాలో జరుగవలసిన అనేక పనుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ని తరచూ కలిసి మాట్లాడుతూ నిరంతరంగా అయనపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకొంటున్నారని తెరాస నేతలే చెపుతుంటారు. కనుక పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావాలని నిజంగా కోరుకొంటున్నట్లయితే ఆయన కూడా నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి మాట్లాడి ఏర్పాటు చేయించుకొనే అవకాశం ఉంది. కానీ మూడేళ్ళయినా కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్న పొన్నం కూడా మూడేళ్ళపాటు ఎందుకు ఊరుకొన్నారు? అంటే అయనకు దీనిపై చిత్తశుద్ది లేదనే భావించవలసి ఉంటుంది.

ఇప్పుడు హటాత్తుగా ఎందుకు దీక్షకు సిద్దం అవుతున్నారు? అంటే బహుశః రాబోయే ఎన్నికల సన్నాహమని అనుకోవాలేమో? అయితే ఈ రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షలంటే 5-6 రోజులకు మించి సాగవని అందరికీ తెలుసు. ఆ తరువాత పోలీసులు వచ్చి దీక్ష భగ్నం చేసి సదరు వ్యక్తులను ఆసుపత్రిలో పడేయడంతో ఆమరణ దీక్షలు ముగుస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక పొన్నం దీక్షతో కరీంనగర్ కు మెడికల్ కాలేజీ వచ్చినా రాకపోయినా ఆ 5-6 రోజులు ఆయనకు ఖచ్చితంగా మీడియాలో మంచి కవరేజి లభిస్తుందని చెప్పవచ్చు. ఆయన కోరుకొంటున్నదీ అదే అయితే ఆయన దీక్షకు తెరాస సర్కార్ అభ్యంతరం చెప్పకపోవచ్చు. 


Related Post