వద్దన్నా తెరాస నేతలు మాట వినేలా లేరు?

July 24, 2017


img

ఈరోజు తెలంగాణా ఐటిశాఖామంత్రి కేటిఆర్ పుట్టినరోజు. కనుక తెరాస నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపడం సహజమే. అయితే తన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఎవరూ పూలబొకేలు తీసుకురావద్దని, తనపేరిట ఎక్కడా ఫ్లెక్సీ బ్యానర్లు, కటవుట్లు పెట్టవద్దని వాటి కోసం వినియోగించే డబ్బును హరితహారం కోసం వినియోగించమని అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కేటిఆర్ నాలుగైదు రోజుల క్రితమే తెరాస నేతలు అందరికీ విజ్ఞప్తి చేశారు. కానీ తెరాస నేతల తీరు మారలేదు.

కేటిఆర్ మాటను కాదనలేక ఈసారి ఫ్లెక్సీ బ్యానర్లు, కటవుట్లు పెట్టలేదు కానీ దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫుల్ పేజి ప్రకటనలు ఇచ్చారు. ఫ్లెక్సీ బ్యానర్ పెడితే రూ.1-2,000 మాత్రమే అవుతుంది. ముచ్చటపడో పోటీపడో ఓ పదేసి పెట్టుకొన్నా 20 వేలకు మించవు. కానీ కేటిఆర్ వద్దని చెప్పడం చేత న్యూస్ పేపర్లలో రూ.50-60 వేలు ఖర్చు చేసి ప్రకటనలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇస్తే అంతకు రెట్టింపు ఖర్చు అవుతుంది అంతే. దీనికంటే బొకేలు తీసుకొని ఉంటే సరిపోయేది కదా అని తెరాస నేతలు మనసులో బాధపడి ఉంటే ఆశ్చర్యం లేదు. అయితే హరితహారంలో పాల్గొనమని కేటిఆర్ చెప్పిన పాయింట్ ను తెరాస నేతలు ఎవరూ క్యాచ్ చేసినట్లు లేదు.



Related Post