అధికారం కోసమే రాజకీయాలు..నీతులు వల్లె వేయడానికి కాదు!

July 24, 2017


img

దేశ ప్రజలు ఇప్పుడు పూర్తి రాజకీయ చైతన్యంతో ఉన్నారనే సంగతి గ్రహించినప్పటికీ మన నేతలు తాము ప్రజాసేవ చేయడానికే ప్రత్యక్షరాజకీయాలలోకి వచ్చామని లేదా ప్రజలు, కార్యకర్తల కోరికను కాదనలేక రాజకీయాలలోకి వచ్చామని చెపుతూ ప్రజల చెవులలో ఇంకా పూవులు పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. కానీ వారు ఎందుకు రాజకీయాలలోకి వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. 

ఆ చేదు నిజాన్నే భాజపా ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ధైర్యంగా బయటపెట్టేరు. వరంగల్ లో నిన్నటితో ముగిసిన భాజపా రాష్ట్ర స్థాయి సమావేశాలలో ఆయన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాజకీయాలంటే నీతులు చెపుతూ కూర్చోవడం కాదు. అధికారంలోకి రావడం కోసమే రాజకీయాలు. కనుక 2019 ఎన్నికలలో తెలంగాణాలో మనం అధికారంలోకి రావడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా మనం వదులుకోకూడదు. తెలంగాణాలో మనం అధికారంలోకి రావడమే మన లక్ష్యంగా అందరూ  కలిసి కట్టుగా పనిచేయాలి,” అని చెప్పారు. 

ఇన్నాళ్ళకు ఒక రాజకీయ నేత ధైర్యంగా, నిజాయితీగా రాజకీయ నేతల అంతర్యాన్ని బయటపెట్టినందుకు చాలా సంతోషమే. అందుకు రాం మాధవ్ ను అభినందించక తప్పదు. అయితే తెలంగాణాలో భాజపా అధికారంలోకి రావడానికి ఆయన చెప్పిన షార్ట్ కట్ విస్మయం కలిగిస్తుంది. 

 “చాలా నిజాయితీపరుడని పేరున్న మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మీద ఇంతవరకు ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. మోడీని ఎవరూ వేలెత్తి చూపలేకపోతున్నారు. సాధారణంగా ఎవరైనా అధికారంలో ఉంటే వారి పాపులారిటీ ఎంతో కొంత తగ్గుతుంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడో అప్పుడు అవినీతి ఆరోపణలు వినిపిస్తుంటాయి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ అంతకంతకూ ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. కనుక తెలంగాణాలో కూడా మనం మోడీ పేరును, ఇమేజ్ ను వాడుకొని అధికారంలోకి రావడానికి మనం గట్టిగా ప్రయత్నించాలి,” అని అన్నారు. 

దేశవిదేశాలలో మోడీ పాపులారిటీ నానాటికీ పెరుగుతోందనేది నూటికి నూరు శాతం నిజమే. అయితే ఆయనకు ఎంత పాపులారిటీ ఉన్నా అది దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్న మాట కూడా వాస్తవమే. అందుకు నిదర్శనంగా తమిళనాడు, కేరళ శాసనసభ ఎన్నికలను చెప్పుకోక తప్పదు. ఆ రెండు రాష్ట్రాలలో భాజపా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

కర్నాటకలో మళ్ళీ ఎప్పటికైనా అధికారంలోకి రావాలనే తపనతో అవినీతిపరుడైన ఎడ్యూరప్పకే పార్టీ పగ్గాలు అప్పగించింది. మోడీ పేరు జపిస్తేనే అధికారం వచ్చే అవకాశం ఉంటే మరి ఎడ్యూరప్ప వంటి అవినీతిపరుడు, మహబూబా ముఫ్తీ వంటి వేర్పాటువాదులతో భాజపా ఎందుకు చేతులు కలుపుతోంది?

అదేవిధంగా తెలంగాణాలో కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఎందుకు తిప్పలు పడుతోంది? ఏపిలో తెదేపాతో ఎందుకు పొత్తులు పెట్టుకొంది? తెలంగాణాలో కేసీఆర్ ప్రభావం, తమ పార్టీ బలహీనతల గురించి తెలిసిఉన్నప్పటికీ మోడీ భజన చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేయవచ్చని రాష్ట్ర భాజపా నేతలు అనుకొంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు.


Related Post