పార్లమెంటు తీర్చిదిద్దిన వ్యక్తిని నేను : ప్రణబ్

July 24, 2017


img

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆదివారం వీడ్కోలు సభ జరిగింది. దానిలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల ఎంపిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసిస్తూనే చిన్నగా చురకలు కూడా వేశారు. 

జి.ఎస్.టి.బిల్లును ఆమోదింపజేసుకోవడంలో మోడీ సర్కార్ ప్రదర్శించిన ఫెడరల్ స్ఫూర్తిని ఆయన మెచ్చుకొన్నారు. కానీ అవసరం లేకపోయినా (భూసేకరణ చట్టం వగైరా) పదేపదే ఆర్డినెన్స్ లను జారీ చేయడాన్ని తప్పుపట్టారు. పార్లమెంటులో చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవలసిన వాటికి ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్దత కల్పించాలని ప్రయత్నించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అదేవిధంగా పార్లమెంటు అర్ధవంతమైన చర్చలకు, నిర్ణయాలకు వేదిక కావాలే గానీ పరస్పర విమర్శలు, రాజకీయ రాద్దంతాలకు కాదని హితవు పలికారు. పార్లమెంటులో అర్ధవంతమైన చర్చలు జరుగకపోవడం వలన నష్టపోయేది ప్రతిపక్షాలే తప్ప ప్రభుత్వం కాదని అన్నారు. ప్రభుత్వం,  పార్లమెంటు సభ్యులందరూ మన దేశ ప్రతిష్టను, పార్లమెంటు ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా వ్యవహరించాలని కోరారు. 

తాను ఈ పార్లమెంటు తీర్చిదిద్దిన వ్యక్తినేనని వినమ్రంగా చెప్పుకొన్నారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా స్వర్గీయ ఇందిరాగాంధీ అత్యుత్తమ నాయకురాలని తను నమ్ముతున్నానని ప్రణబ్ అన్నారు. ఈ మూడేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ తనకు చాలా చక్కగా సహకరించారని చెప్పారు. ఈ దేశానికి యధాశక్తిన సేవలు అందించాననే పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ, చిరకాలంగా పార్లమెంటుతో పెనవేసుకుపోయిన ఈ బంధాన్ని శాశ్వితంగా తెంచుకొని వెళ్ళవలసి వస్తుంనందుకు మనసులో చాలా బాధగా ఉందని అన్నారు. ఇంతకాలం తనను అన్నివిధాల ఆధారించి, సహకరించి, గౌరవించినందుకు అధికార, ప్రతిపక్ష సభ్యులందరికీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 



Related Post