అధికారంలోకి రావాలనే కోరిక మంచిదే కానీ...

July 22, 2017


img



భాజపాకు రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి మాత్రమే ఉన్నారు. వారిలో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భాజపాలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. ఏకైక ఎంపి బండారు దత్తత్రేయ ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనే కనిపిస్తుంటారు..ఆయన కేంద్రమంత్రి గనుక అది తప్పు కాదు. రాజా సింగ్, దత్తన్న కాకుండా మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలు. వారు ముగ్గురే ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీలో ప్రధానంగా కనిపిస్తుంటారు. ఆ ముగ్గురితోనే వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాలని కలలు కంటుండటం విశేషం. 

ఆ ప్రయత్నాలలో భాగంగానే నేటి నుంచి వరంగల్ లో భాజపా కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండురోజుల పాటు సాగే ఆ సమావేశాలకు బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించడం ఈ సమావేశాల ప్రధానోద్దేశ్యం. 

భాజపా ఉద్దేశ్యం గొప్పదే..ప్రజలు అవకాశం ఇస్తే అధికారంలోకి రావాలని అన్ని పార్టీలు తహతహలాడుతూనే ఉంటాయి. కనుక భాజపా కూడా తహతహలాడటం తప్పు కాదు. అయితే వచ్చే ఎన్నికలలో గెలవడం గురించి ఆలోచించే ముందు ఆ ఎన్నికలలో పార్టీ తరపున నిలబెట్టడానికి 119 మంది అభ్యర్ధులను తయారుచేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ అప్పటికి రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగినట్లయితే భాజపాపై ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. 

అయితే తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని రాష్ట్ర భాజపా నేతలు ఎన్ని గొప్పలు చెప్పుకొంటున్నా రాష్ట్రంలో 17 ఎంపి సీట్లను సాధించడంపైనే భాజపా దృష్టి ఉందని అమిత్ షా మాటలలోనే స్పష్టమయింది. కనుక ఆ లెక్కన చూసుకొన్నా కూడా తెరాస, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలను డ్డీకొని ఓడించగల బలమైన అభ్యర్ధులు అవసరం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో తెదేపాకు దూరం అయ్యింది కనుక వచ్చే ఎన్నికలలో భాజపా ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. పైగా శత్రువుగా మార్చుకొన్న తెదేపాను కూడా డ్డీకొనవలసి ఉంటుంది. కనుక మోడీ భజన చేసి తెలంగాణాలో అధికారంలోకి వచ్చేయవచ్చనే భ్రమలో ఉన్నారు. కనుక వారు ముందుగా ఆ భ్రమలో నుంచి బయటపడి 17 మంది ఎంపి అభ్యర్ధులను వెతికి పట్టుకొని వారిని గెలిపించుకోవడం కోసం ఏమేమీ చేయాలో అవి మాత్రమే చేస్తే మంచిదేమో? లేకుంటే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యే అవకాశం ఉంటుంది.


Related Post