దేశంలో 1.62 లక్షల సూట్ కేస్ కంపెనీలున్నాయా!

July 22, 2017


img

పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో నిన్న కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ ఈ ఏడాది జూలై 12 వ తేదీ వరకు దేశంలో 1.62 లక్షల సూట్ కేస్ కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని చెప్పారు. వాటిని స్థాపించినవారు వాటి ద్వారా ఎటువంటి వ్యాపారలావాదేవీలు నిర్వహించడం లేదని అందుకే వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు చెప్పారు. వాటిని వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో కాకుండా తమ వద్ద పోగుపడిన నల్లదనాన్ని దాచుకోవడానికి, తెల్లధనంగా మార్చుకోవడానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నామని జైట్లీ చెప్పారు. ఆ సూట్ కేస్ కంపెనీల ద్వారా నల్లదనాన్ని విదేశాలకు తరలించినవారిపై, నలుపును తెలుపుగా మార్చుకోవడానికి ప్రయత్నించిన వారిపై చట్టప్రకారం కటిన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. 

జైట్లీ చెప్పిన ఈ అధికారిక లెక్కల ప్రకారమే దేశంలో 1,62,618 సూట్ కేస్ కంపెనీలున్నాయనె విషయం బయటపడింది. సూట్ కేస్ కంపెనీల ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ జగన్మోహన్ రెడ్డి తాలూకు సూట్ కేస్ కంపెనీలు గుర్తుకు వస్తే తప్పుకాదు. అతనిపై సిబిఐ  నమోదు చేసిన 11 కేసులలో ఆ కంపెనీల ప్రస్తావన పదేపదే వస్తుంటుంది. కొంతకాలం క్రితం ముంబైలోని సూట్ కేస్ కంపెనీలపై ఈడి అధికారులు దాడులు చేసినప్పుడు వాటిలో కూడా జగన్ కు సంబంధించిన రెండు సూట్ కేస్ కంపెనీలున్నట్లు వార్తలు వచ్చాయి. మన చట్టాలలో లొసుగులు అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకొంటున్నవి దేశంలో ఇంకెన్ని లక్షల సూట్ కేస్ కంపెనీలున్నాయో అవి ఎంత నల్లదనం పోగేసుకొన్నాయో ఎవరూ ఊహించలేరు. కంటికి కనిపించకుండా తెర వెనుక జరుగుతున్న ఈ వైట్ కాలర్ ఆర్ధిక నేరాలను వాటికి కారకులైనవారిపై ప్రభుత్వం కటినమైన చర్యలు తీసుకోలేకపోతే నోట్లరద్దు, నగదు రహిత లావాదేవీలు, బ్యాంకుల విలీనం వంటి ఎన్ని సంస్కరణలు అమలుచేసినా ఆశించిన ప్రయోజనం కనబడదు. 


Related Post