బి.ఎస్.ఎన్.ఎల్. కూడా దానికి రెడీ

July 22, 2017


img

దేశంలో నేటికీ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ బి.ఎస్.ఎన్.ఎల్. దానికున్న ఖాతాదారులు..ఉద్యోగులు..నెట్ వర్క్..శక్తి సామర్ద్యాలు దేశంలో మరే ఇతర ఆపరేటర్ కు లేవనే చెప్పాలి. కానీ పోస్టల్..దూరదర్శన్..వంటి ప్రభుత్వరంగ సంస్థలలాగే అది కూడా ప్రైవేట్ ఆపరేటర్లు ముందు మోకరిల్లి తన వ్యాపార సామ్రాజ్యాన్ని..దానిపై తన గుత్తాధిపత్యాన్ని క్రమక్రమంగా వదులుకొంటోంది. ఒకపక్క తమ సంస్థను, వ్యాపారాలను కాపాడుకోవడానికి బి.ఎస్.ఎన్.ఎల్. విశ్వప్రయత్నాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో దాని నాసిరకమైన పనితీరు వలన దాని ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. 

దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న సంస్థలలో బి.ఎస్.ఎన్.ఎల్. మొట్టమొదటిదే అయినా..నిన్న మొన్న పుట్టుకు వచ్చిన ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేకపోతోంది. దాదాపు అన్ని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు 4జిని ఎప్పుడో లాంచ్ చేశారు. కానీ బి.ఎస్.ఎన్.ఎల్. మాత్రం 4జి వ్యవస్థ ఏర్పాటుకు ఇంకా టెండర్ల దశలోనే ఉంది. 

వచ్చే ఏడాది మార్చి నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో 4జి సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని బి.ఎస్.ఎన్.ఎల్. తెలంగాణా సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.అనంత రామ్ తెలిపారు. దాని కోసం ఆంధ్రలో 600 సైట్స్, తెలంగాణాలో 550 సైట్స్ కలిపి మొత్తం 1,150 సైట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 10,000 సైట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాటి కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.

బి.ఎస్.ఎన్.ఎల్. ఇప్పటికైనా 4జిని ప్రారంభించాలనే ఆలోచన కలిగినందుకు సంతోషమే. కానీ జియో నిన్న ప్రారంభించిన ఉచిత ఫీచర్ ఫోన్.. దానితో నెలకు కేవలం రూ.153లకే అపరిమిత 4జి వాయిస్ కాల్స్, డేటా, టీవి ఛానల్స్, మ్యూజిక్ వగైరాలన్నీ ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచే అందించబోతోంది. దానితో బి.ఎస్.ఎన్.ఎల్.కు ఆయువుపట్టు వంటి 2జి, 3జి ఖాతాదారులందరినీ జియో ఎగరేసుకొని వెళ్ళిపోబోతోందనే విషయం గ్రహించిందో లేదో? కనుక 4జి లాంచింగ్ సంగతి దేవుడెరుగు..ముందుగా తన 2జి ఖాతాదారులను కాపాడుకోవడానికి బి.ఎస్.ఎన్.ఎల్. యుద్దప్రాతిపదికన ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. లేకుంటే అది 4జి సేవలు ప్రారంభించే సమయానికి వాటిని వాడుకొనేందుకు బి.ఎస్.ఎన్.ఎల్. వద్ద వినియోగదారులే ఉండకపోవచ్చు. జియో మ్రోగిస్తున్న ప్రమాదఘంటికలు మొట్టమొదట బి.ఎస్.ఎన్.ఎల్.కే వర్తిస్తాయని గ్రహించి ఎంత త్వరగా మేలుకొంటే అంత మంచిది. లేకుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు. 


Related Post