ఈరోజు జియో ఫీచర్ ఫోన్ గురించి ముఖేష్ అంబానీ చేసిన ప్రకటన వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకపక్క ఫోన్ ఉచితం అంటూనే దానిని పొందాలంటే రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని చెప్పడం చూస్తే ఆయన తెలివిగా వ్యవహరిస్తున్నారా లేక అతితెలివి ప్రదర్శిస్తున్నారా? అనే అనుమానం కలుగకమానదు. ఫోన్ ఉచితంగా ఇస్తామని చెప్పినప్పుడు మళ్ళీ దానికి డిపాజిట్ కట్టమని అడగకూడదు. లేదా ఫోన్ ఖరీదు రూ.1,500 అని చెప్పినా ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు.
మూడేళ్ళ తరువాత ఆ డిపాజిట్ ను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. అంటే మూడేళ్ళవరకు తన కస్టమర్లను వేరే నెట్ వర్క్ లోకి మారిపోకుండా దీనితో ‘లాక్’ చేసుకోవాలనుకొంటున్నారన్న మాట! మూడేళ్ళపాటు కస్టమర్లు జియోని అంటిపెట్టుకొని ఉంటే వారి వలన జియోకి జరిగే బిజినెస్ తక్కువేమీ ఉండదు కనుక వారి డబ్బును వారికి తిరిగి చెల్లించడం గొప్ప విషయమేమీ కాదు. అంటే అప్పుడే మనకు ఫోన్ ఉచితంగా ఇచ్చినట్లు అవుతుందన్న మాట!
ఒకవేళ మద్యలో జియోను వద్దనుకొంటే ఆ డబ్బు తిరిగిరాదని వేరేగా చెప్పనవసరం లేదు. అప్పుడు ఆ ఫోనే మనకు మిగులుతుంది. ఒకవేళ దానిని కూడా జియో పనిచేయకుండా చేస్తే చెత్త బుట్టలో పడేయాల్సిందే. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫోన్ కొంటే మూడేళ్ళపాటు జియోని అంటిపెట్టుకొని ఉండాల్సిందేనన్న మాట.
అయితే ఈ ఫోన్ కోసం కాకపోయినా దాని ద్వారా అతి తక్కువ ధరకే కాల్స్, డేటా, మ్యూజిక్ వగైరాలు లభిస్తాయి కనుక చాలా మంది దానిని తప్పకుండా తీసుకొనే అవకాశం ఉంది. వచ్చే 12 నెలలలోగా దేశంలో 99 శాతం ప్రజలకు ఈ ఫోన్ ద్వారా జియో నెట్ వర్క్ లోకి తీసుకు రావడమే తమ ముఖేష్ అంబానీ చెప్పారు. అదే జరిగితే దేశంలో అన్ని టెలికాం కంపెనీలు మూతపడక తప్పదన్న మాట. ఇప్పటికే జియో దెబ్బకు విలవిలలాడుతున్న టెలికాం కంపెనీలు ఈ దెబ్బను తట్టుకోగలవో లేదో చూడాలి.