తెరాసపై భాజపా మళ్ళీ విమర్శలు షురూ

July 21, 2017


img

భాజపాకు ఎంతో కీలకమైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయేలో తెరాస భాగస్వామి కానప్పటికీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. ఆ కారణంతోనే గత నెలరోజులుగా రాష్ట్ర భాజపా నేతలు తెరాసను పల్లెత్తు మాట అనలేదు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూడా భాజపా అబ్యార్ది వెంకయ్య నాయుడికే బేషరతుగా మద్దతు ఇస్తామని తెరాస ప్రకటించింది కనుక రాష్ట్ర భాజపా నేతలు మళ్ళీ మెల్లగా నోరువిప్పి తెరాసపై విమర్శలు మొదలుపెట్టారు. ఒకవేళ తెరాస ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతు ఇచ్చి ఉండి ఉంటే ఈ విమర్శలు అప్పుడే మొదలైపోయుండేవని వేరే చెప్పనవసరం లేదు.  

ఇంతకాలం మౌనంగా ఉన్న రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నిన్న రాష్ట్రపతి ఎన్నికలు ఫలితాలు వెలువడగానే హైదరాబాద్ లో తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని మజ్లీస్ పార్టీ నేతలకు తాకట్టు పెట్టారు. మజ్లీస్ తో భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 17న తెలంగాణా విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదు. ఈసారైనా తెరాస సర్కార్ అధికారికంగా తెలంగాణా విమోచన దినోత్సవం జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే మేమే ఆరోజున బారీ బహిరంగ సభ నిర్వహిస్తాము. సెప్టెంబర్ 10 నుంచి 12వరకు మూడు రోజుల పాటు మా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణాలో పర్యటిస్తారు. ఆగస్ట్ 10 వ తేదీ నుంచి నవంబర్ నెలాఖరు వరకు మా పార్టీ ఉదృతంగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలలోకి వెళ్ళాలని నిశ్చయించాము. తెరాస అప్రజాస్వామిక పాలనపై మేము పోరాటాలు ప్రారంభిస్తాము,” అని చెప్పారు. 

రాష్ట్ర భాజపా నేతలకు తెలంగాణా విమోచన దినోత్సవం జరిపించడంపై ఉన్నంత ఆసక్తి తెలంగాణా రాష్ట్రాభివృద్ధి, తెలంగాణా ప్రజలపై ఉన్నట్లు కనబడటం లేదు. విభజన చట్ట ప్రకారమే తెలంగాణా రాష్ట్రానికి రావలసినవి చాలా ఉన్నాయి. హైకోర్టు విభజన వంటి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం వారు ఎప్పుడూ గట్టి ప్రయత్నాలు చేసిన దాఖలాలు కనబడవు. కానీ తెలంగాణా విమోచన దినోత్సవం జరిపితే చాలన్నట్లు మాట్లాడుతుంటారు. అది కూడా దానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ విషయంపై మాట్లాడటం ప్రారంభిస్తారు. ఆ తరువాత మళ్ళీ ఏడాది వరకు ఆ ఊసే ఎత్తారు. ఇదీ మన రాష్ట్ర భాజపా నేతల తీరు. 



Related Post