మీరే ముందు వెనక్కు వెళ్ళండి: భారత్

July 21, 2017


img

సిక్కిం సరిహద్దులో డొక్లాం వద్ద భారత్-చైనా-భూటాన్ దేశాలను కలిపే ముక్కోణపు జంక్షన్ వద్ద దాదాపు నెలరోజులుగా భారత్-చైనా సేనలు ఎదురెదురుగా నిలిచి ఉన్నాయి. రెండు దేశాలు ఎదుటదేశమే దురాక్రమణకు పాల్పడిందని వాదించుకొంటున్నాయి. అక్కడ భారత్ మోహరించిన తన సైనికులను తక్షణమే వెనక్కు తీసుకోకపోతే యుద్ధం తప్పదని చైనా బెదిరిస్తోంది. అయితే చైనా బెదిరింపుల భారత్ ఏమాత్రం భయపడటం లేదు వెనక్కి తగ్గే ఆలోచన కూడా చేయడం లేదు.

సరిహద్దుల వద్ద నెలకొన్న ఈ ఉద్రిక్త వాతావరణంపై పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న సమాధానం చెపుతూ,” చైనా బెదిరింపులకు భయపడి వెనక్కు తగ్గేది లేదు. మనం వెనక్కు తగ్గితే చైనా మరింత ముందుకు చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే భారత్ భద్రతకు చాలా ప్రమాదం కలుగుతుంది. గత కొన్నేళ్లుగా చైనా దురాక్రమణకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు సిక్కిం సరిహద్దుల వద్ద రోడ్లు నిర్మించడానికి సిద్దం అయ్యింది. ఇంకా ఉపేక్షిస్తే మనకే ప్రమాదం. మనం మన సరిహద్దుల్లోనే ఉన్నాము. ఆ సంగతి యావత్ దేశాలకు కూడా తెలుసు. కనుక హద్దులు దాటి ముందుకు చొచ్చుకువచ్చిన చైనాయే తన సైనికులను వెనక్కు తీసుకోవాలి. అప్పుడే మన సైనికులను కూడా వెనక్కు తీసుకొంటాము. ఒకవేళ చైనా ఏమాత్రం సాహసం చేసినా దానిన్ గట్టిగా తిప్పి కొడతాము. దాని బెదిరింపులకు భయపడి వెనక్కు తగ్గబోము. భారత్ ను బెదిరించి భయపెట్టి వెనక్కు పంపించగలమనే ఆలోచనను చైనా మానుకొంటే మంచిది. ఈ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు. అదే సరైన మార్గం కూడా,” అని అన్నారు. 

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల మెతక వైఖరిని చూసి చైనా, పాకిస్తాన్ లు భారత్ భూభాగాలను దురాక్రమణ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ మొట్టమొదటి సారిగా ఇంత ధీటుగా సమాధానాలు, ధీటుగా సైనిక ప్రతిక్రియలు ఎదురవుతుండటంతో జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ సరిహద్దు వివాదం చివరకు ఏవిధంగా ముగుస్తుందో చూడాలి.   



Related Post