ఆ ప్రాజెక్టుపై ఇక ముందుకే..

July 21, 2017


img

తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వలననే అది చాలా అపకీర్తి మూటగట్టుకోవడం విచిత్రమే. ఆ ప్రాజెక్టు భూసేకరణ కోసం ప్రభుత్వం చూపిన అత్యుత్సాహం, దానిపై ప్రతిపక్షాల పోరాటాలు, నిర్వాసితరైతుల నిరాహార దీక్షలు, వారికి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన ప్రతిపక్ష నేతలను పోలీసుల చేత అడ్డగించడం, అందుకు ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయించడం వంటి అనేక పరిణామాలు తెరాస సర్కార్ కు తీరని అప్రదిష్ట కలిగించాయి. 

అయితే దానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకే వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు మార్గం సుగమం అవడంతో ప్రాజెక్టు నిర్మాణానికి గురువారం టెండర్లు పిలిచింది. మొత్తం రూ.6,805.42 కోట్లు విలువగల ప్రాజెక్టు పనులను 4 వేర్వేరు ప్యాకేజీలుగా విడదీసింది. వాటిలో రూ.1,822.60 కోట్లు, 1,499.41 కోట్లు, 2,046.64 కోట్లు,1,436.77 కోట్లు విలువగల పనులుగా విభజించింది. ఆసక్తిగల కాంట్రాక్ట్ సంస్థలు ఆగస్ట్ 5 లోగా కొటేషన్లు దాఖలు చేయాలని కోరింది.

మల్లన్న సాగర్ ప్రాజెక్టును 50 టి.ఎం.సి.ల నిలువ సామర్ధ్యం ఉండేవిధంగా నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. అక్కడ అంతబారీ రిజర్వాయర్ అవసరమేలేదని, దాని వలన నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండదని, ఆ ప్రాజెక్టు తెరాస నేతల జేబులు నింపుకోవడానికే కడుతున్నారని వాదిస్తున్నాయి.

కానీ వాటి వాదనలు అర్ధరహితమని, తెలంగాణా రాష్ట్రమంతటా నీళ్ళు పారించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలోనే మల్లన్న సాగర్ నిర్మాణం కోసం టెండర్లు పిలిచింది. కనుక ఇప్పుడు నిర్వాసిత రైతులు, ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 


Related Post