రాజకీయాలకు, మీడియాకు మద్య ఉండవలసిన సన్నటి గీత చెరిగిపోయిన తరువాత ఆ రెండింటినీ విడదీసి చూడలేని పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీలు స్వంత మీడియాను ఏర్పాటు చేసుకోవడం లేదా మీడియానే పార్టీలు వారిగా చీలిపోయి వాటికి అనుకూల వార్తలు వ్రాసుకొంటూ..ప్రసారం చేసుకొంటూ, తమ రాజకీయ ప్రత్యర్ధుల మీద విమర్శలు ఆరోపణలు చేస్తుండటం సర్వసాధారణ విషయమైపోయింది ఈరోజుల్లో.
అటువంటిదే సాక్షి మీడియా కూడా. అది జగన్మోహన్ రెడ్డి.. వైకాపా అంతరంగానికి అద్దం పడుతుందని అందరికీ తెలిసిందే. జగన్ కుటుంబమే దాని యజమాని కనుక అది సహజం కూడా. ఆ కారణంగా జగన్ ప్రత్యర్ధులు ఎవరో ఆన్-లైన్ సాక్షి న్యూస్ పేపర్ ను మార్ఫింగ్ విధానంతో దానికి నకిలీని సృష్టించి జగన్మోహన్ రెడ్డిని అప్రదిష్టపాలుజేసే ప్రయత్నం చేయడం విస్మయం కలిగిస్తుంది.
అచ్చం సాక్షి ఆన్-లైన్ న్యూస్ పేపర్ మాదిరిగానే కనిపిస్తున్న సాక్షి క్లిప్పింగ్ జూలై 18న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దానిలో “వెంకయ్యనాయుడును ఉప-రాష్ట్రపతిగా ప్రతిపాదించింది నేనే: జగన్” అనే శీర్షికతో ఒక వార్త ప్రచురించబడింది.
దానిలో “వెంకయ్య నాయుడు రాష్ట్రానికి చేసిన సేవలకు కృతజ్ఞతగా ఆయనకు ఏమైనా చేయాలని డాక్టర్ రాజశేఖర్ రెడ్డిగారు ఎప్పుడూ ఆలోచిస్తుండేవారని జగన్ పేర్కొన్నారు. మొన్న (జగన్ కు) కలలో కనిపించి అదే విషయం మళ్ళీ గుర్తు చేశారు. మర్నాడు విజయసాయి రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి ఆలోచన వచ్చింది. నేనే అమిత్ షాకు ఫోన్ చేసి ప్రతిపాదించాను అని జగన్ చెప్పారు. ఈ విషయం తెలుసుకొన్న మోడీ, ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప ఆలోచనలు ఉన్న నీవు స్వాతి ముత్యం అని నన్ను పొగిడారు,” అని జగన్ చెప్పారు అని జగన్ ఫోటోతో కూడిన వార్త ఉంది.
అది సాక్షి పేపర్ లాగే కనిపిస్తోంది కనుక దానిని చదివినవారు అవి జగన్ మాటలే అని నమ్మే అవకాశం ఉంటుంది. దాని వలన జగన్ పట్ల వారికి చులకనభావం కలిగే అవకాశం కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఈవిధంగా తమపై కొందరు చేస్తున్న కుట్రలను, అభాండాలను సాక్షి పాఠకులు నమ్మవద్దని సాక్షి మీడియా కోరింది.
ఈ పరిణామాలు చూస్తే మీడియాలో కూడా ఏ స్థాయిలో పోరాటాలు జరుగుతున్నాయో... అవి క్రమంగా ఏవిధంగా దిగజారుతున్నయో అర్ధం చేసుకోవచ్చు.