వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో నేడు కీలక పరిణామం జరిగింది. తమపై మోపబడిన 11 కేసులను కలిపి విచారణ జరపాలని మొదట కోరిన జగతి పబ్లికేషన్స్ ఇప్పుడు ఆ పిటిషన్ ను కోర్టు అనుమతితో ఉపసంహరించుకోవడం విశేషం.
ఈ 11 కేసులన్నీ ఒకదానితో మరొకదానికి అవినాభావ సంబంధం ఉన్నందున, ఒక్కో కేసును వేర్వేరుగా విచారిస్తున్నప్పుడు ఒక కేసు విచారణలో లభించిన ఆధారాలతో (క్లూలు) మరొక కేసు ఇంకా బలపడుతోందని భావించిన జగన్ లాయర్లు అన్నిటినీ కలిపి ఒకేసారి విచారించాలని గతంలో కోరారు. ఆవిధంగా చేస్తే ఆ కేసుల నుంచి త్వరగా బయటపడవచ్చని భావించి ఉండవచ్చు. కానీ గురువారం ఈ కేసుల విచారణ సందర్భంగా అన్ని కేసులను కలిపి విచారించాలనే తమ పిటిషన్ ఉపసంహరించుకోవడం విశేషం. అంటే ఇక 11 కేసులు వేర్వేరుగా విచారించమని కోరినట్లే భావించవలసి ఉంటుంది.
ఆవిధంగా చేస్తే తమకు చట్టప్రకారం అన్యాయం జరుగుతోందని వాదించిన జగన్ తరపు లాయర్లు ఇప్పుడు మళ్ళీ ఆవిధంగానే కేసులను విచారించాలని ఎందుకు కోరుకొంటున్నారు? వారు ఈ కేసుల విషయంలో అయోమయానికి గురవుతున్నారా లేక వేరే ఏదైనా వ్యూహం ఉందా? అనే సందేహం కలగడం సహజమే.
ఒకవేళ అన్ని కేసులను కలిపి ఒకేసారి విచారించినట్లయితే ఏమవుతుంది? అని ఆలోచిస్తే వాటిలో జగన్మోహన్ రెడ్డి దోషిగా తేలితే మళ్ళీ జైలుకు వెళ్ళవలసి వస్తుందని వేరే చెప్పనవసరం లేదు. మరో రెండేళ్ళలో ఎన్నికలు రాబోతున్నందున ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ కేసుల విచారణ వేగం పుంజుకొని తీర్పు వెలువడితే సరిగ్గా ఎన్నికల ముందు జగన్ జైలుకు వెళ్ళవలసి రావచ్చు. అయితే ఒకవేళ అటువంటి తీర్పే వచ్చినా కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించి అరెస్టును వాయిదా వేసుకోవచ్చు కానీ ఆ తీర్పు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిపై, రాజకీయంగా వైకాపాపై ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దానిని తెదేపా బలమైన ఆయుధంగా ఉపయోగించుకొని ఎన్నికలలో వైకాపాను మళ్ళీ దెబ్బ తీసే అవకాశం కూడా ఉంటుంది. బహుశః అందుకే అన్ని కేసులు కలిపి విచారించాలనే తమ పిటిషన్ ను ఉపసంహరించుకొని ఉండవచ్చు.
అయితే 11 కేసులు దేనికవి విడివిడిగా విచారిస్తే తమకు చట్టప్రకారం అన్యాయం జరుగుతోందని ఇదివరకు వాదించారు కదా? మరి ఇప్పుడు అన్యాయం జరుగదా? అనే సందేహం కలుగుతుంది. అన్యాయం జరిగినా ఈ 11 కేసుల విచారణ ముగిసి తీర్పు వెలువడేసరికి మరో 10-15 ఏళ్ళు పట్టినా పట్టవచ్చు. ఆ తరువాత హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీలు చేసుకొనే వెసులుబాటు ఉండనే ఉంటుంది. అంటే ఈ కేసుల విచారణలోనే జగన్ జీవితం హాయిగా గడిచిపోవచ్చు. బహుశః అందుకే హటాత్తుగా తమ పిటిషన్ ఉపసంహరించుకొని ఉండవచ్చు. ఏమైనప్పటికీ ఈ కేసులన్నీ తేలేవరకు జగన్ నెత్తి మీద కత్తి వ్రేలాడుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.