ఈ నవరత్నాల గోలేమిటో..

July 20, 2017


img

ఏపిలో ఇప్పుడు నవరత్నాలపై జోరుగా చర్చ జరుగుతోంది. అవి ఆభరణాలలో ధరించే రత్నాలు కావు. వచ్చే ఎన్నికలలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గెలిచి ఏపికి ముఖ్యమంత్రి అయితే అయన రాష్ట్రానికి..ప్రజల కోసం  అమలు చేయబోయే 9 హామీలు. వాటినే వైకాపా నవరత్నాలని గొప్పగా చెప్పుకొంటుంటే, అవి రత్నాలు కావు..వజ్రాలు కావు..గులకరాళ్ళు అని తెదేపా నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 

తాము సృష్టించిన ఆ నవరత్నాలను చూసి తెదేపా నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని వైకాపా గొప్పలు చెప్పుకొంటుంటే, అటువంటి రత్నాలను మేమెప్పుడో జనాలకు పంచిపెట్టేశామని తెదేపా నేతలు కౌంటర్ ఇస్తున్నారు. 

జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెంకన్నకు మొక్కి అక్టోబర్ 27 నుంచి 3,000 కిమీ పాదయాత్ర చేయడానికి సిద్దం అవుతున్నారు. కనుక “అన్న వచ్చేస్తున్నాడహో..రాజన్న రాజ్యం వచ్చేస్తోందహో... అన్న నడిచొస్తే మాస్..అన్న స్పీచ్ ఇస్తే మాస్..ఇక చంద్రబాబు పని అయిపోయినట్లే” అని వైకాపా నేతలు ప్రచారం చేసుకొంటున్నారు. ఆ సందర్భంగా ఆయన ఏపిలో జనాల కోసం ప్రశాంత్ కిషోర్ చేత ప్రత్యేకంగా తయారుచేయించిన ఆ నవ రత్నాలను విరివిగా పంచిపెట్టబోతున్నారు.

కానీ “జగన్ 3వేలు కాదు..30 వేలు మైళ్ళు కాళ్ళరిగేల పాదయత్ర చేసినా అధికారంలోకి రావడం కల్ల. అయితే గియితే..సిబిఐ  కేసులలో మళ్ళీ జైలుకు వెళ్ళే అవకాశాలే ఎక్కువ,” అని తెదేపా నేతలు కౌంటర్ ఇస్తున్నారు. 

వారి వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నా మద్యలో సాక్షి, ఆంధ్రజ్యోతి మీడియాలు కూడా చెరోపక్షం నిలబడి రాజకీయ యుద్దాలు చేస్తుండటం మరో విశేషం. ప్రశాంత్ కిషోర్ రాకతో వైకాపా నేతలలో గుబులు మొదలైందని ఆంధ్రజ్యోతి వరుసగా కధనాలు వండి వడ్డించేస్తుంటే, “నవరత్నాల గొప్పదనం-తెదేపాపై వాటి ఎఫక్ట్” గురించి సాక్షి కధలు కధలుగా వర్ణించి చెపుతోంది. అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తుమ్మినా దగ్గినా అది నవరత్నాల  మహిమే (ఎఫెక్టే) అని చెప్పుకొంటోంది. 

కానీ విశేషం ఏమిటంటే వైకాపా నేతలు ఎవరూ ఆ నవరత్నాల విలువను గుర్తించకుండా ఎంతసేపు ప్రశాంత్ కిషోర్ గురించే ఆలోచిస్తున్నట్లున్నారు. యూపిలో సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలకు శల్యసారధ్యం చేసి బీజేపిని గెలిపించిన ఆయనే వచ్చే ఎన్నికలలో తెదేపాను కూడా తప్పకుండా గెలిపిస్తారని తెదేపా నేతలు గట్టిగా నమ్ముతున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎవరిని గెలిపిస్తారో చూడాలి. 


Related Post