బొకేలొద్దు...బ్యానర్లొద్దు...హారం చాలు: కేటిఆర్

July 20, 2017


img

ఈ నెల 24వ తేదీన ఐటి మంత్రి కేటిఆర్ పుట్టినరోజు. కనుక తెరాస నేతలు, ప్రజా ప్రతినిధులు ఆయనకు పూల బొకేలు ఇచ్చి ఊరూవాడ ఆయన ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టి జన్మదినశుభాకాంక్షలు తెలియజేసి ఆయన మెప్పుపొందాలని ప్రయత్నించడం సహజమే. కానీ అటువంటి పనులు చేయవద్దని ఆయన ముందుగానే తెరాస నేతలకు ట్వీట్ మెసేజ్ పెట్టారు. ‘బొకేలొద్దు...బ్యానర్లొద్దు...హారం చాలు’ అంటున్నారు. అంటే బంగారు హారాలు తెమ్మనికాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనమని కోరారు. బొకేలు, ఫ్లెక్సీలకు పెట్టె డబ్బుతో మొక్కలు నాటమని కోరారు. 

గత రెండేళ్లుగా ఆయన తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందు తెరాస నేతలకు ఇదేవిధంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి కూడా అదే చేశారు. నిజానికి ఫ్లెక్సీ బ్యానర్లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కానీ తెలంగాణా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో, అనధికారిక కార్యక్రమాలలో కూడా ఫ్లెక్సీ బ్యానర్లు విరివిగా వాడుతూనే ఉన్నారు. 

ఇటీవల కేటిఆర్ ఆదిలాబాద్ పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానిక తెరాస నేతలు ఆయనకు స్వాగతం చెప్పేందుకు బారీగా ఫ్లెక్సీ బ్యానర్స్ ఏర్పాటుచేసినప్పుడు ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణం వాటిని అన్నిటినీ తొలగింపజేశారు. మళ్ళీ అటువంటి పనులు చేయవద్దని అందరినీ హెచ్చరించారు కూడా. అయినా తెరాస కార్యక్రమాలలో ఫ్లెక్సీ బ్యానర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని గట్టిగా హెచ్చరిస్తే తప్ప తెరాస నేతల వైఖరిలో మార్పురాదేమో?   


Related Post