తెలంగాణా ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆయువుపట్టుగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన ఓయు విద్యార్ధులు రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస ప్రభుత్వానికి కానివారు అయినట్లు, వారు తమ రాజకీయ శత్రువులు అన్నట్లుగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ మూడేళ్ళ ఒక్క మంత్రి కూడా ఉస్మానియాలో అడుగుపెట్టలేదు. విద్యార్ధులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తెలంగాణా ఏర్పడిన తరువాత ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉస్మానియాలో మొట్టమొదటిసారి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్ధులను ఉద్దేశ్యించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం వారి పట్ల ప్రభుత్వ వైఖరికి అద్దం పట్టింది. అది విమర్శలకు తావిచ్చింది.
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా విద్యార్ధులు లాటీ దెబ్బలు తిన్నారు. పోలీస్ కేసులను ఎదుర్కొన్నారు. తమ ఉజ్వల భవిష్యత్ ను, చివరికి ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి వారు వెనుకాడలేదు. తెరాసతో సహా బహుశః ఏ రాజకీయ పార్టీలో నేతలు, కార్యకర్తలు అన్ని త్యాగాలు చేసి ఉండరు. నిజానికి ఉస్మానియా విద్యార్ధుల పాలుపంచుకోకుంటే తెలంగాణా ఉద్యమాలలో అంత వేడి పుట్టేది కాదేమో? అటువంటి ఉస్మానియా విద్యార్ధుల పట్ల ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా వ్యవహరించవలసిన తెరాస సర్కార్ ఇంత కటినంగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్ధం కాదు.
ఓయు హాస్టల్స్ లో విద్యార్ధుల కంటే బోర్డర్సే (బయటివారు) ఎక్కువగా ఉంటున్నారని, విద్యార్ధులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సహజంగానే వారిని చాలా బాధించాయి. ఆయన తమను ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్ధులు మంగళవారం ఉస్మానియాలో బంద్ పాటించారు.
ఓయులో ఇదివరకు చదువుకొన్న విద్యార్ధులు (ప్రస్తుతం నిరుద్యోగులు) ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్ వచ్చినప్పుడు హాస్టల్స్ లో తలదాచుకోవాలనుకోవడం సహజమే. వారి ఆర్ధిక పరిమితులే అందుకు కారణమని గ్రహించి ప్రభుత్వం సానుభూతితో వారి సమస్యను పరిష్కరించి ఉండి ఉంటే వారు కూడా సంతోషించి ఉండేవారు.
ఇక విద్యార్ధులు ఎవరైనా మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తున్నట్లయితే దాని గురించి వ్యాఖ్యలు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. ఆ మహమ్మారిని తక్షణం యూనివర్సిటీ ప్రాంగణం నుంచి బయటకు పారద్రోలడానికి అవసరమైన కటిన చర్యలు తీసుకొంటే విద్యార్ధుల జీవితాలు నాశనం కాకుండా కాపాడుకోవచ్చు. ఆ పనికి కూడా విద్యార్ధుల సహకారం కోరి ఉంటే వారు కూడా సంతోషంగా ప్రభుత్వానికి సహాయపడేవారు కదా!