ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రతిపాదిస్తున్న రైతు సంఘాల ఏర్పాటుతో రైతులకు మేలు కలుగుతుందనేది వాస్తవమే కానీ వాటి ఏర్పాటుతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలు ఏర్పడితే వాటికి ప్రభుత్వమే నిధులు (మూలధనం) సమకూరుస్తుంది. ఆ రైతు సంఘాల సిఫార్సుల ఆధారంగానే వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.8,000 చొప్పున అందివ్వబోతోంది. ఈ ఆలోచన విజయవంతం అయితే మున్ముందు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, గొర్రెల పంపకం, ఒంటరి మహిళలకు పించన్లు వంటి సంక్షేమ పదకాలకు కూడా ఈ రైతు సంఘాలు సిఫార్సులు తప్పనిసరి చేయవచ్చు. వాటికి ప్రభుత్వమే నిధులు అధికారాలు సమకూర్చుతుంది కనుక వాటిలో సభ్యులుగా ఉన్న రైతులందరినీ తెరాస సర్కార్ నియంత్రించే అవకాశం ఉంటుందనేది వేరేగా చెప్పనవసరం లేదు. మరోవిధంగా చెప్పాలంటే ఈ సంఘాల ద్వారా గ్రామస్థాయి వరకు ప్రజలందరినీ తెరాస వైపు ఆకర్షించి తన ప్రాబల్యాన్ని విస్తరించుకొనే ప్రయత్నంగా చెప్పవచ్చు. ఈ సంఘాల ద్వారా రైతులకు మేలు చేకూరుతుంది. మరోవైపు తెరాసకు బలం పెరుగుతుంది.
ఒకవేళ ఈ పధకం విజయవంతం అయితే తెరాసకు ఇక తిరుగు ఉండదు. వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ పార్టీ కలలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి. ఈ సంఘాల ఏర్పాటు కోసం జరుగుతున్న కసరత్తుపై కాంగ్రెస్ నేతలు ఇంతవరకు స్పందించకపోవడం గమనిస్తే వారు కేసీఆర్ వ్యూహాన్ని ఇంకా పసిగట్టినట్లు లేరనిపిస్తుంది.