గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో అవసానదశకు చేరుకొంటున్న చేనేత, పవర్ లూమ్ రంగాలను కాపాడేందుకు మంత్రి కేటిఆర్ చూపుతున్న శ్రద్ద, చొరవ చాలా అభినందనీయం. ఆయన కృషివలన ఆ రెండు రంగాలలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. చేనేత, పవర్ లూమ్ కార్మికులలో మళ్ళీ కొత్త ఉత్సాహం కనబడుతోంది. రాష్ట్రంలో ఆ రెండు పరిశ్రమలు మళ్ళీ చాలా కాలం తరువాత కళకళలాడుతున్నాయి. అందుకు ప్రధాన కారణం బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా రాష్ట్రంలో నిరుపేద మహిళలకు పంచేందుకు చీరలు తయారు చేసి ఇచ్చే పనిని వాటికి అప్పగించడమే. బతుకమ్మ పండుగ కోసం ఏకంగా 95 లక్షల చీరలు తయారుచేసే బాధ్యత (వర్క్ ఆర్డర్) రాష్ట్రంలో పవర్ లూమ్ కార్మికులకు అప్పగించడంతో వారు రేయింబవళ్ళు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్స్, ఇంకా ఇతర పధకాల కోసం సుమారు 25 లక్షల మీటర్లు వస్త్రాలకు సేకరించబోతోంది.
ఇక నుంచి ఏడాది పొడవునా చేనేత, పవర్ లూమ్ కార్మికులకు పని కల్పించేవిధంగా వస్త్ర సేకరణకు ఒక క్యాలెండర్ రూపొందించి దానిని ఇకపై ప్రతీ సంవత్సరం అమలుచేస్తామని మంత్రి కేటిఆర్ చెప్పారు. బతుకమ్మ పండుగకు 95 లక్షల చీరలు, రంజాన్ పండుగకు 36 లక్షల మీటర్లు, క్రిస్మస్ పండుగకు 27 లక్షల మీటర్లు ప్రతీ ఏటా చేనేత, పవర్ లూమ్ కార్మికులు తయారుచేసేందుకు ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇవికాక రాజీవ్ విద్యా మిషన్ కోసం కోటి 20 లక్షల మీటర్లు, సాంఘీక సంక్షేమ హాస్టల్స్ కోసం 30 లక్షల మీటర్లు, వైద్యశాఖ మరియు ఇతర శాఖల అవసరాలకు సుమారు 25 లక్షల మీటర్లు వస్త్రాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కేటిఆర్ చెప్పారు. వీటివలన చేనేత, పవర్ లూమ్ కార్మికులకు ఏడాది పొడవునా పని దొరకుతుంది. ఆ రంగాలపై ఆధారపడినవారి జీవితాలకు ఆర్దికభద్రత ఏర్పడుతుందని మంత్రి కేటిఆర్ చెప్పారు. ఇటువంటి మంచి ఆలోచనలు చేసి, చేనేత, పవర్ లూమ్ కార్మికులను ఆదుకొన్నందుకు మంత్రి కేటిఆర్ కు అభినందనలు.