ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు కొత్తకొత్త రాజకీయ పార్టీలు ఆవిర్భవించడం ఎన్నికల తరువాత అవి కనుమరుగవుతుండటం ఈరోజుల్లో చాలా సాధారణమైన విషయమే. తెలంగాణాలో ఇప్పటికే రెండుమూడు కొత్త పార్టీలు, ఫోరంలు ఏర్పడ్డాయి. ఆ జాబితాలో మరో కొత్త పార్టీ చేరబోతోంది. తెలంగాణా సామాజిక న్యాయసాధన జెయేసి చైర్మన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో సోషల్ జస్టిస్ పార్టీ ఏర్పడబోతోంది. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ప్రకటించారు.
ముందుగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సామాజిక న్యాయ సాధన జేఏసీ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలన్నీ ప్రజలను కులాలు, మతాలవారీగా చీల్చి అధికారం చేజిక్కించుకొంటున్నాయని అన్నారు. ఈ పరిస్థితి మారి అందరికీ సమన్యాయం, సమానావకాశాలు కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు.
జస్టిస్ చంద్రకుమార్ చెప్పిన విషయాలు నిజమే కానీ మన రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కించుకొనేందుకు అమలుచేస్తున్న వ్యూహాలను ఎదుర్కొని ఎన్నికలలో గెలవడం అసంభవమని ఆయన గ్రహించినట్లు లేదు. ఎన్నికలు, ఓట్ల విషయంలో ప్రజల ఆలోచనావిధానంలో మార్పులు తీసుకురావడానికి కృషి చేసిన లోక్ సత్తా అది సాద్యం కాదని గ్రహించి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంది. చిరంజీవి కూడా సామాజిక న్యాయం అంటూ పార్టీ పెట్టి చివరకు దానిని కాంగ్రెస్ లో విలీనం చేసేసి కేంద్రమంత్రి పదవి పుచ్చుకొని సర్దుకుపోయారు. కనుక కొత్తగా ఏర్పాటవుతున్న సోషల్ జస్టిస్ పార్టీ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.