ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో భూరికార్డుల తనికీ, రైతు సంఘాల ఏర్పాటు తదితర కార్యక్రమాలపై చర్చించి మార్గదర్శకాలు జారీచేసేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో సంబంధితశాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు తద్వారా రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఏమేమి చర్యలు చేపట్టిందో తెలియజేశారు. “నాకు జిడిపి లెక్కలు అవసరం లేదు...దేశంలో ఆర్ధిక నిపుణులు అంచనాలు గణాంకాలు అక్కరలేదు. ప్రభుత్వం ఏమి చేస్తే రైతుల జీవితాలలో వెలుగులు నింపగలమని ఆలోచిస్తూ తదనుగుణంగా పనిచేసుకొనిపోతున్నాము. మనం చేపట్టిన కార్యక్రమాలకు అప్పుడే మంచి ఫలితాలు కనబడటం మొదలయ్యింది. పాలమూరు, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగునీరు పారించడం వలన ఆ జిల్లాలలో వ్యవసాయం జోరందుకొంది. ఇంతకు ముందు విద్యుత్ లేక..నీళ్ళు లేక..పొట్ట చేత్తో పత్తుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోయినవారందరూ మళ్ళీ వెనక్కు తిరిగివస్తున్నారు. అంటే మనం చేస్తున్న పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం అవుతోంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇక ముందు కూడా ఇదేవిధంగా మనం ముందుకు సాగితే మరో ఐదేళ్ళ తరువాత బ్యాంకర్లే అప్పులిస్తామని రైతుల ఇళ్ళ ముందు నిలబడే పరిస్థితి వస్తుంది. రావాలని నా కోరిక. రైతుల సంక్షేమం కోసం ఏమి చేయలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే వచ్చే ఏడాది మే నుంచి రాష్ట్రంలో రైతులు అందరికీ ఎకరానికి రూ.8,000 చొప్పున అందించబోతున్నాము. త్వరలోనే 24 గంటలు ఉచిత విద్యుత్ కూడా అందించబోతున్నము. రైతు సంఘాలు ఏర్పాటు చేసి రైతులను సంఘటిత శక్తిగా మార్చబోతున్నాము. భూరికార్డులను మళ్ళీ సమూలంగా పరీక్షించి వాటిలో లోపాలను సరిదిద్ది రైతన్నకు భరోసా కల్పించబోతున్నాము. తెలంగాణా సాధనతో మనం ఏమి సాధించుకొన్నామో లోకానికి చాటి చూపే రోజు వస్తుంది,” అని కేసీఆర్ అన్నారు.