వెంకయ్యకు బేషరతుగా మద్దతు ఇస్తాం!

July 18, 2017


img

ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్ధి పేరు ఖరారు చేయక మునుపే, భాజపా ఎవరిని నిలబెట్టినా బేషరతుగా మద్దతు ఇస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. దానికి తెదేపా తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. జగన్ సిబిఐ కేసుల భయంతోనే అందరికంటే ముందుగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇస్తామని ప్రకటించేరని తెదేపా నేతలు ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న వెంకయ్య నాయుడుకి కూడా జగన్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ వంటి అత్యున్నత స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలనేదే తమ అభిమతమని, ఆవిధంగా ఎన్నిక జరిగితేనే హుందాగా ఉంటుందనె ఉద్దేశ్యంతోనే ఎన్డీయ అభ్యర్ధులు రాంనాథ్ కోవింద్. వెంకయ్య నాయుడుకి మద్దతు ప్రకటించామని జగన్ అన్నారు. తెలుగువారైన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కావడం తెలుగువారందరికీ ఆనందం కలిగించే విషయమేనని అన్నారు. 

జగన్ గతంలో తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదేవిధంగా వ్యవహరించారు. వైకాపా ఎమ్మెల్యేలను తెరాసలోకి ఆకర్షించి తీసుకుపోతున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధులకు మద్దతు పలికారు. అప్పుడూ ఇలాగే ఏదో సంజాయిషీ ఇచ్చి నవ్వులపాలయ్యారు. ఈ ఎన్నికలలో జగన్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం వైకాపా నేతలకు కూడా మింగుడుపడక ఇబ్బందిపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జగన్ కారణాలు జగన్ కున్నాయి కనుక తమ రాజకీయ శత్రువు(తెదేపా)కి భాజపాకు మిత్రుడనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ బేషరతుగా మద్దతు ఇస్తున్నారు.


Related Post