డ్రగ్స్ కేసులో తెలుగు సినీ పరిశ్రమలో నోటీసులు అందుకొన్నవారందరికీ సిట్ ముందు విచారణకు హాజరు కావలసిన డేట్స్ వచ్చేశాయి. వారిలో అందరి కంటే ముందుగా దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరుకావలసి ఉంది. ఆయన ఈనెల 19న హాజరు కావలసి ఉంది. తరువాత అందాల భామ ఛార్మీ 20న, సుబ్బరాజు 22న, కెమెరా మ్యాన్ శ్యాం కె నాయుడు 23న, రవితేజ 24న, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా 25న, నవదీప్ 26న, తరుణ్ 27న, చివరిగా తనిష్ నందులను 28న సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావలసి ఉంటుంది.
నోటీసులు అందుకొన్న వారిలో ఏ ఒక్కరూ కూడా
తమకు డ్రగ్స్ సేవించే అలవాటు ఉందని అంగీకరించలేదు. అది సహజమే. అయితే వారి పేర్లు
ఎక్సైజ్ శాఖ చేతిలో ఎలా పడ్డాయి? అనే ప్రశ్నకు అందరూ మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న
కెల్విన్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఒకవేళ విచారణలో ఎవరైనా మాదకద్రవ్యాలు
వాడినట్లు నిర్ధారిస్తే కష్టమే. అటువంటి వారిని మొదటి తప్పుగా హెచ్చరికలతో సరిపెట్టి
పంపించేస్తే అదృష్టమే. ఒకవేళ ఈ కేసుతో సంబంధం లేదని తేలితే ఇంకా అదృష్టమే.
ఏమైనప్పటికీ సినీ ప్రముఖులకు ఇటువంటి కేసులో నోటీసులు అందుకోవడం తీరని అప్రదిష్ట
కలిగిస్తోంది. వారిలో నిజంగా ఏ తప్పు చేయనివారు కూడా కేవలం నోటీసులు అందుకొన్న
కారణంగా అటు సినీ పరిశ్రమలో, ఇటు ప్రజల ముందు కూడా తలవంచుకోవలసివస్తోంది. అనేక
ఆటుపోటులు ఎదుర్కొన్న తెలుగుసినీ పరిశ్రమ ఈ సమస్య నుంచి కూడా త్వరలోనే
గట్టెక్కుతుందనే ఆశిద్దాం. ఏమైనప్పటికీ జరుగుతున్న ఈ పరిణామాలు తెలుగు సినీ చరిత్రలో చీకటి రోజులుగా
చెప్పుకోకతప్పదు.