రాష్ట్రపతి ఎన్నికలలో రాష్ట్ర జనాభాను బట్టి ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంటుంది కనుక ప్రతీ ఎంపి, ఎమ్మెల్యే ఓటు చాలా కీలమైనదే. రాష్ట్రపతిని ఎన్నుకునే వారిలో రాజ్యసభ సభ్యులు: 233 మంది, లోక్‌సభ సభ్యులు: 543 మంది, శాసనసభ్యులు: 4120 మంది ఉన్నారు.
ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ కలిపి మొత్తం 4896 మంది ఓటర్లున్నారు. వారి మొత్తం ఓట్ల విలువ 10,98,903 కాగా వారిలో ఎంపిల ఓట్లకు 5,49,408, ఎమ్మెల్యేల ఓట్లకు 549495 పాయింట్లుగా నిర్ధారించబడ్డాయి. మళ్ళీ వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 27,825, తెలంగాణా నుంచి 15708 ఎలక్ట్రాల్ ఓట్లు ఉన్నాయి.
ఆంగ్లో-ఇండియన్ల తరఫున లోక్‌సభకు నామినేట్ అయిన ఇద్దరు ఎంపిలకు, రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ సభ్యులకు ఈ ఎన్నికలలో ఓటు హక్కు ఉండదు. అలాగే అన్ని రాష్ట్రాలలో శాసనమండళ్ల సభ్యులకు కూడా ఓటు హక్కు ఉండదు.
తెలంగాణాలో తెరాసతో సహా అన్ని పార్టీలు కలిపి మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపిలు ఉన్నారు. వారిలో కాంగ్రెస్, మజ్లీస్, వామపక్షాల ప్రజా ప్రతినిధులు మీరా కుమార్ కు ఓటు వేయబోతుండగా, తెరాస, తెదేపా, భాజపాల ప్రతినిధులు రాంనాథ్ కోవింద్ కు వేయబోతున్నాయి. జనాభాను బట్టి తెలంగాణాలో ఒక్కో ఎమ్మెల్యే ఓటుకు 132, ఆంధ్రాలో ఒక్కో ఎమ్మెల్యే ఓటుకు 159 ఎలక్ట్రాల్ పాయింట్లుగా నిర్ధారించబడింది.
ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు కలిపి మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపిలు ఉన్నారు. వారిలో తెదేపా, భాజపా, వైకాపాల ప్రతినిధులు రాంనాథ్ కోవింద్ కు వేయబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏపిలో ఎమ్మెల్యేలు, ఎంపిలు లేనందున అది ఈ ఎన్నికలలో పాల్గొనలేదు.
ఈ ఎన్నికలలో ఎన్డీయే దానికి బయట నుంచి మద్దతు ఇస్తున్న తెరాస, వైకాపా, అన్నాడిఎంకె, సమాజ్ వాదీ తదితర పార్టీల ఎలక్ట్రాల్ ఓట్లు సుమారు 6-7 లక్షల వరకు ఉండవచ్చునని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఎన్డీయే అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంచనప్రాయమేనని భావించవచ్చు.