వారి పేర్లు ఎందుకు బయటపట్టడం లేదు?

July 15, 2017


img

సినీ పరిశ్రమలో మత్తుమందులు సేవిస్తున్న వారికి ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపించినప్పటికీ వారి పేర్లను బయటపెట్టకపోవడాన్ని తప్పు పడుతూ భాజపా యువమోర్చ కార్యకర్తలు శనివారం నాంపల్లి వద్దగల ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు వారిని ఎందుకు వెనకేసుకొని వస్తున్నారని నిలదీశారు. తక్షణమే వారందరి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే హైదరాబాద్ లో నడుస్తున్న పబ్ లను, హుక్కా సెంటర్లను మూసివేయించాలని వారు డిమాండ్ చేశారు. భాజపా కార్యకర్తల హడావుడి పెరగడంతో పోలీసులు వారిని వ్యానులో ఎక్కించి అక్కడి నుంచి ఘోషామహల్ స్టేడియంకు తరలించారు. 

సినీ ప్రముఖుల పేర్లను ఎక్సైజ్ శాఖ బయటపెట్టనప్పటికీ నోటీసులు అందుకొన్న నటీనటులు స్వయంగా ఆవిషయం బయటపెట్టి తమకు డ్రగ్స్ అలవాటు లేదని అయినా తమకు నోటీసులు ఎందుకు పంపించారో తెలియదని చెప్పారు. వారికి డ్రగ్స్ అలవాటు ఉందా లేదా అనేది విచారణలో తేలవచ్చు. 

వారికి ఆ అలవాటు ఉందనే అనుమానంతోనే నోటీసులు పంపించినప్పుడు వారి పేర్లను దాచిపెట్టడం దేనికి? ఆవిధంగా చేయడం వలన వారిని కాపాడేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. చట్టం,న్యాయం అందరికీ సమానమే అని చెపుతున్నపుడు సినీ ప్రముఖుల విషయంలో ఎక్సైజ్ శాఖ ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది? 

ఒకపక్క కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిని, అక్రమాలను, అసాంఘిక చర్యలను సహించమని చెపుతూ మరోపక్క  మాదకద్రవ్యాలను సేవిస్తున్న సినీ ప్రముఖుల పేర్లను, దేశంలో నల్లదనం పోగేసుకొన్నవారి పేర్లను, విదేశాలలో నల్లదనం దాచినవారి పేర్లను, బ్యాంకుల వద్ద వేలకోట్లు రుణాలు తీసుకొని ఎగవేస్తున్న బడా పారిశ్రామికవేత్తల పేర్లను దాచిపెట్టడం ద్వారా మళ్ళీ వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తుండటం చాలా శోచనీయం. అటువంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న వారిని శిక్షించే ఉద్దేశ్యం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు లేనప్పుడు వారిని పట్టుకోవడం ఎందుకు?


Related Post