మియాపూర్ భూకుంభకోణం వేడి ఇంకా చల్లారక ముందే మరో బారీ కుంభకోణం బయటపడింది. కుతుబుల్లా పూర్ మండలంలోని బాచుపల్లిలో రూ.300 కోట్లు విలువ గల 32 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు కనబడటం లేదని (మాయం అయినట్లు) తెలంగాణా ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.
బాచుపల్లిలో సర్వే నెంబర్స్ 51,52 ల క్రింద ఉన్న 32 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. దానికి సంబంధించిన భూరికార్డులు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో భద్రంగా ఉండాలి. కానీ అవి మాయం అయ్యాయి.
ఆ భూమిపై ప్రభుత్వానికి, హెచ్ మల్లేశ్వర్ రావు ఇంకా అనేక మంది పిటిషనర్లకు మద్య చిరకాలంగా న్యాయవివాదం జరుగుతోంది. ఆ భూమిని శ్రీ లక్ష్మి హౌసింగ్ ఎంటర్ ప్రైజస్ సంస్థ అధినేత జి.పూర్ణారావు కొంత మంది వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసి దానిని ప్లాట్స్ గా వేసి అమ్ముకొన్నారు. ఆ భూమి అసైన్డ్ భూమి కనుక దానిపై ఎటువంటి లావాదేవీలు చేయడానికి వీలులేదని వాదిస్తూ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేసింది. దానిపై అభ్యంతరం తెలుపుతూమల్లేశ్వర్ రావుతో సహా అక్కడ ప్లాట్లు కొనుకొన్నవారు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
ఆ కేసును విచారిస్తున్న హైకోర్టు జస్టిస్ ఏ రామలింగేశ్వర రావు, ఆ భూములు ప్రభుత్వానివేనని నిరూపించే రికార్డులు సమర్పించాలని ఆదేశించారు. అనేక వాయిదాలు తరువాత ఆ భూరికార్డులు కనబడటం లేదని ప్రభుత్వ న్యాయవాది చావు కబురు చల్లగా చెప్పడంతో న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ కార్యాలయంలో భద్రంగా ఉంచవలసిన రికార్డులు ఏవిధంగా మాయం అయ్యాయని ప్రశ్నిస్తే ప్రభుత్వ న్యాయవాది సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. అది ప్రభుత్వభూమే అని నిరూపించేందుకు 1991 నాటి ఫైసల్ పట్టి అనే పత్రాన్ని మాత్రం కోర్టుకు సమర్పించారు.
భూమి హక్కులకు సంబంధించి సరైన రికార్డు లేకుండా ఏవిధంగా తుది తీర్పు చెప్పగలమని ప్రశ్నించిన జస్టిస్ రామలింగేశ్వర రావు, ఆ భూరికార్డులు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో నుంచి ఏవిధంగా మాయం అయ్యాయి? వాటి నకళ్ళు ఉన్నాయా లేవా? అనే విషయాలపై దర్యాప్తు చేసి తమకు ఆగస్ట్ 8లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూశాఖ ప్రధానకార్యదర్శికి నోటీసులు పంపించారు.
ఏపిలోని విశాఖపట్టణంలో కూడా వందల ఎకరాల భూరికార్డులు రెవెన్యూ కార్యాలయాల నుంచి మాయం అయ్యాయి. అనేక రికార్డులు టాంపరింగ్ జరిగినట్లు తేలడంతో ఏపి సర్కార్ సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. తెలంగాణాలో కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇటువంటి అక్రమాలు జరుగుతున్నట్లు ఈ కేసుతో బయటపడింది. రెవెన్యూ కార్యాలయాల నుంచే భూరికార్డులు మాయం అయిపోతే ఇక వాటిని ఎక్కడ భద్రపరచాలి?దీనిపై తెలంగాణా ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.