ఆగస్ట్ 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం. తెలంగాణా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి ప్రభుత్వ శాఖలలో అధికారులు, ఉద్యోగులు అందరూ చేనేత వస్త్రాలను ధరించాలని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ రోజు తెరాస ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పకుండా చేనేత వస్త్రాలు ధరించి, తమ తమ జిల్లాలలో జరిగే చేనేత ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ మంత్రి కేటిఆర్ అందరికీ లేఖలు వ్రాశారు. ఆ రోజున అన్ని జిల్లాలలో చేనేత వస్త్రాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయించి, వాటి అమ్మకాలను ప్రోత్సహించాలని కేటిఆర్ తన లేఖలో కోరారు. ప్రజలను కూడా చేనేత వస్త్రాలు ధరించేలా ప్రోత్సహించాలని కోరారు. ఆరోజున చేనేత కార్మికులను, మంచి డిజైనింగ్ చేస్తున్న చేనేత కళాకారులను ఘనంగా సన్మానించాలని కోరారు. చేనేత కార్మికుల పరిస్థితి మెరుగుపరిచేందుకు తెరాస సర్కార్ చేపడుతున్న అనేక చర్యల గురించి లేఖలో వివరించి, వాటి గురించి ప్రజలకు తెలియజేయాలని కేటిఆర్ తన లేఖలో కోరారు.
చేనేత, పవర్ లూమ్ కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం రెండు పధకాలను సిద్దం చేస్తోంది. 1. ఒక్కో చేనేత కుటుంబానికి నెలకు కనీసం రూ.15,000 ఆదాయం వచ్చే విధంగా పధకాలు సిద్దం చేస్తోంది. 2. ఈ ఏడాది జరుగబోయే బతుకమ్మ పండుగకు రాష్ట్రంలో పేద మహిళలకు ఒక్కొక్కరికీ రెండేసి చీరలు అందించాలని నిర్ణయించింది. ఒక్కో చీరకు రూ.200 చొప్పున కోటి చీరల తయారీకి ఆర్డర్ ఇచ్చింది. ఆ చీరలు తయారు చేసే బాధ్యత పవర్ లూమ్ కార్మికులకు అప్పగించడంతో వారు గత రెండు నెలలుగా రేయింబవళ్ళు పనిచేస్తున్నారు.
దీనితో ఒకపక్క వారికి పని కల్పిస్తూనే తెలంగాణావాసులందరికీ అతి ముఖ్యమైన బతుకమ్మ పండుగ రోజున పేద మహిళందరికీ కొత్త బట్టలు అందించినట్లు అవుతుంది. ప్రభుత్వం, ప్రజలు కూడా ఈవిధంగా మానవతా దృక్పధంతో ఆలోచిస్తే ఇటువంటి అనేక ఆలోచనలు చేసి చేనేతన్నలను ఆదుకోవచ్చు.