సుమారు 13 ఏళ్ళపాటు న్యాయపోరాటం తరువాత ఆసిఫ్ నగర్ మండలంలోని 46 ఎకరాల వివాదాస్పద భోజగుట్ట భూములు తెలంగాణా ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు తుదితీర్పు చెప్పడంతో తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఆ భూములకు సమీపంలోనే మురికివాడలలో నివసిస్తున్న నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఆ భూమిని జి.హెచ్.ఎం.సి.కి అప్పగించడానికి అధికారులు అవసరమైన చర్యలు మొదలుపెట్టారు.
హైదరాబాద్ నగరంలోనే ఇటువంటి ప్రభుత్వభూములపై 2500 కేసులు హైకోర్టులో నడుస్తున్నాయి. వాటిపై తీర్పు వచ్చినట్లయితే వందల కోట్లు విలువగల భూములు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయి. కానీ ఆ కేసులు ఇంకా ఎప్పటికి పరిష్కారం అవుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.
మియాపూర్ భూకుంభకోణం తరువాత ప్రభుత్వ భూములను కాపాడుకోవడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. కోట్లు విలువచేసే ఆ భోజగుట్ట భూములను ఖాళీగా ఉంచితే మళ్ళీ ఎవరో ఒకరు దురాక్రమణకు పాల్పడవచ్చు. కనుక వాటిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చాలా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు.