ఇంతకీ వైఎస్సార్ ఎవరివాడు?

July 06, 2017


img

సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి జూలై 8న అంటే రేపు జరుగుతుంది. కాంగ్రెస్, వైకాపా రెండు పార్టీలకు ఆయనతో సంబంధం కలిగి ఉన్నాయి. కానీ ఆయన పేరు ప్రతిష్టలను చేపట్టిన పధకాలను జగన్ స్వంతం చేసుకోవడంతో ఏపి కాంగ్రెస్ పార్టీ ఆయనతో తమ బంధం కొనసాగించాలో వద్దో తెలియని అయోమయస్థితిలో ఉంది. తెలంగాణా ఏర్పడిన తరువాత టీ-కాంగ్రెస్ నేతలు ఆయన పేరే ఎత్తడం మానుకొన్నారు. 

ఈ నేపధ్యంలో కాంగ్రెస్, వైకాపాలు ఇటీవల పరస్పరం విమర్శలు చేసుకొన్నందున రేపు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాలకు తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఎవరూ హాజరుకావద్దని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. 

వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఈజిప్టు మమ్మీతో, సోనియా గాంధీని రాక్షసితో పోల్చినందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు అందరూ రేపటి కార్యక్రమాన్ని బహిష్కరించాలని హనుమంతరావు కోరారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకొని అక్రమాస్తులు సంపాదించుకొన్నందునే సిబిఐ అతనిపై కేసులు పెట్టి జైలుకు పంపితే అందుకు సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నారని హనుమంతరావు అన్నారు. 

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ వైకాపాకు ఎప్పుడో దూరం అయినప్పటికీ, ఆంధ్రాలో మాత్రం నిన్నమొన్నటి వరకు వైకాపాతో పొత్తుల కోసం ఆశగా ఎదురుచూసింది. కానీ జగన్ ఎప్పుడైతే మోడీని కలిసి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి బేషరతుగా మద్దతు పలికారో అప్పటి నుంచి వైకాపాపై ఆశలు వదిలేసుకొని విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. ఏపిలో ఆ రెండు పార్టీల మద్య పరస్పరవిమర్శలలో వైకాపా నేతలు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీను విమర్శించడంతో తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా ఆ యుద్ధంలో ప్రవేశించవలసి వచ్చింది. ఇంతకీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించదలచుకొందో లేదో? కాంగ్రెస్ నేతలు ఎవరికీ తెలియదు. 


Related Post