దత్తన్నా..సాయం చేస్తూ విమర్శలేందుకే?

July 03, 2017


img

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర భాజపా నేతలతో కంటే ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస మంత్రుల పక్కనే ఎక్కువగా కనిపిస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కనుక తెరాస సర్కార్ ను విమర్శించడం కూడా అరుదే. రైతుల పంటరుణాల మాఫీ విషయంలో ఆయన తెరాస సర్కార్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆదివారం హైదరాబాద్ దిల్ కుష్ ప్రభుత్వ అతిధి భవనంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఈ ఖరీఫ్ సీజనులో రైతులకు సుమారు రూ.23,000 కోట్లు రుణాలు అందవలసి ఉంది. కానీ నాలుగవ దశ పంట రుణాల మాఫీ కోసం ప్రభుత్వం నిధులు ఇంతవరకు విడుదల చేయకపోవడంతో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని నేను ఆర్.బి.ఐ.ఉన్నతాధికారులతో మాట్లాడితే వారు రాష్ట్రంలోని గ్రామీణ, సహకార, వాణిజ్య బ్యాంకులకు సోమవారం రూ.1,700 కోట్లు విడుదల చేయడానికి అంగీకరించారు. తెరాస సర్కార్ ఇప్పటికైనా నాలుగవ విడత పంట రుణాల మాఫీకి నిధులు విడుదల చేయాలి,” అని అన్నారు. 

పంట రుణాల మాఫీ చేస్తామని కేసీఆరే హామీ ఇచ్చారు కనుక దానిని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంది. అదేవిధంగా కేంద్రం నుంచి తెలంగాణాకు రావలసిన నిధులను సకాలంలో విడుదల చేయవలసిన భాద్యత కేంద్రంపై ఉంది. కానీ మంత్రి కేటిఆర్ తో సహా తెరాస ఎంపిలు ఎన్నిసార్లు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా హామీలే తప్ప నిధులు విడుదల చేయడం లేదు. తెలంగాణా ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందున వాటన్నిటి కోసం నిధులు సర్దుబాటు చేయవలసి ఉంది. కనుక పంట రుణాల మాఫీ కోసం నిధుల విడుదలలో ఆలస్యం కావడం సహజం. బండారు దత్తాత్రేయ వంటి సీనియర్ రాజకీయనేతలు ఈ సంగతి తెలియదనుకోలేము. కనుక ఆయన తెరాస సర్కార్ ను విమర్శించడం కంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావలసిన నిధులను ఇప్పటికైనా విడుదల చేయిస్తే బాగుంటుంది.

ఇక జి.ఎస్.టి. అమలులోకి రావడంతో ఇంతవరకు స్థానిక పన్నుల రూపేణా అందుతున్న ఆదాయాన్ని కోల్పోయింది. దాని వలన కూడా రాష్ట్ర ఆర్దికపరిస్థితి కుంటుపడుతుంది. అటువంటి ప్రమాదం జరుగకుండా దానిని భర్తీ చేస్తామని జి.ఎస్.టి.కౌన్సిల్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకొనే విధంగా దత్తన్న కేంద్రంపై ఒత్తిడి తేవలసి ఉంటుంది.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల కోసం గట్టిగా కృషి చేసి సాధించిపెడుతున్నట్లుగానే దత్తన్న కూడా తెలంగాణా రాష్ట్రంలో గట్టిగా కృషి చేస్తే అందరూ హర్షిస్తారు. 


Related Post