జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది మార్చిలో ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రకటించారు. తిరుపతిలో నిన్న జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, “ప్రస్తుతం పార్టీ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే మార్చిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాము. అదే సమయంలో మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారు. వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో మన పార్టీ తప్పకుండా విజయం సాధించి, పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాము,” అని అన్నారు.
రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు సేవ చేయడానికే తపించిపోతున్నట్లు చెప్పుకొంటున్నప్పటికీ అదే నోటితో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అవి బహిరంగంగానే చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికారం కోసం కాదు..ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చెప్పుకొన్నారు. ఇప్పటి వరకు ఆవిధంగానే ముందుకు సాగుతున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన తన పార్టీలోకి ఇతర పార్టీల నేతలను ‘ఇంపోర్ట్’ చేసుకొని నిర్మించుకొనే ప్రయత్నం చేయకుండా ప్రజలు, అభిమానులలో జనసేన సిద్దాంతాల పట్ల ఆసక్తి ఉన్నవారితో పార్టీని నిర్మించుకొంటున్నారు. దేశవాళి రాజకీయాలు చూడటానికి అలవాటుపడిన వారు, ఇతర పార్టీల నేతలు అది చూసి ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నప్పటికీ, అవకాశవాదులైన పార్టీ నేతలతో కాకుండా ప్రజలతోనే తన పార్టీని నిర్మించుకోవాలనే పవన్ కళ్యాణ్ ఆలోచన అభినందనీయమే. ఆ ప్రయోగం విజయవంతం అవుతుందా లేదా..మున్ముందు కూడా ఇదే పద్దతికి జనసేన కట్టుబడి ఉంటుందా అవకాశవాద నేతలను చేర్చుకొంటుందా? అనేది రానున్న రోజులలో చూడవచ్చు. అది వేరే సంగతి.
కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెపుతుంటే, అధికారమే లక్ష్యంగా..పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి చెప్పడం జనసేన కూడా సగటు రాజకీయ పార్టీ అనే భావన కల్పించారు. రాజకీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా ఎన్నికలలో పోటీ చేయడం నేరం కాదు. కానీ పార్టీ సిద్దాంతాల ప్రకారం ముందుకు సాగితే గౌరవంగా ఉంటుంది కదా!