పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నిన్న హైదరాబాద్ లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతల శిక్షణా శిభిరం లో పాల్గొన్నపుడు వారితో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను, మైనార్టీలను రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మాయమాటలు, భూటకపు హామీలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అమలుచేసిన వ్యూహాన్నే వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కూడా అమలుచేసి తప్పకుండా అధికారంలోకి వస్తామని అన్నారు.
కాంగ్రెస్ హయంలో ఆ పార్టీలోని దళిత, బడుగు, బలహీన వర్గాల నేతలు పైకి ఎదగగలిగారు తప్ప తమ వర్గం ప్రజల అభ్యున్నతికి చేసిందేమీ లేదనే చెప్పాలి. ఒకవేళ ఏమైనా చేసి ఉన్నా అది కంటి తుడుపు చర్యలే తప్ప ఎవరినీ ఉద్దరించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన పార్టీ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొనే పధకాలను రూపొందిస్తున్న మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే ఆయన చాలా చిత్తశుద్ధితోనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.
ఇక పంజాబ్ ఫార్ములాను తెలంగాణాలో అమలుచేసి అధికారంలోకి వస్తామని ఉత్తం కుమార్ రెడ్డి చెప్పడం విచిత్రంగా ఉంది. ఎందుకంటే పంజాబ్ లో రాజకీయ పరిస్థితులకు తెలంగాణాలో పరిస్థితులకు చాలా తేడా ఉంది. అక్కడ ఇదివరకు అధికారంలో ఉన్న భాజపా-అకాలీదళ్ ప్రభుత్వం అత్యంత అసమర్ధ ప్రభుత్వంగా చెడ్డపేరు మూటగట్టుకొంది. ఇక పంజాబ్ ను పట్టి పీడిస్తున్న అక్రమ డ్రగ్స్ సరఫరా, అమ్మకాలలో అకాలీదళ్ నేతలే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ పాలనతో విసుగెత్తిపోయిన పంజాబ్ ప్రజలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ కప్పగంతులు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చాయి.
కానీ తెలంగాణాలో తెరాస సర్కార్ పాలనను కేంద్రప్రభుత్వంమే మెచ్చుకొంటోంది. అది ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలుచేస్తున్నాయి. ప్రభుత్వం పట్ల కొంతమంది ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పటికీ అది అమలుచేస్తున్న సంక్షేమ పధకాల వలన లబ్ది పొందుతున్నవారందరూ తెరాసవైపే ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. తెరాస మళ్ళీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరుంటారో..అయన పాలన ఏవిధంగా ఉంటుందో ప్రజలకు తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఏవిధంగా రాష్ట్రాన్ని నడిపిస్తారో ఎవరికీ తెలియదు. కనుక కాంగ్రెస్ కంటే తెరాస వైపే ప్రజలు మొగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక పంజాబ్ ఫార్ములాతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఏమీ సాధించలేదు.