ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా దళితుడైన రాంనాథ్ కోవింద్ ను నిలబెట్టడంతో ప్రతిపక్షాలు కంగుతిన్నాయి. తమను సంప్రదించకుండా ఆయన పేరును ప్రకటించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తప్ప దళితుడైన ఆయనను నిర్ద్వందంగా వ్యతిరేకించలేక అలాగని సమర్ధించలేక తలలు పట్టుకొంటున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మద్దతు ప్రకటించి ఉండి ఉంటే తెలంగాణా కాంగ్రెస్ నేతలు బహుశః ఆయనను మెచ్చుకొంటూ మాట్లాడి ఉండేవారు. కానీ తమ అధిష్టానం వేరే అభ్యర్ధిని నిలబెట్టాలని ఆలోచిస్తోంది కనుక వారు మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, దళిత వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టినంత మాత్రాన్న దేశంలో దళితులపై దాడులు నిలిచిపోతాయా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దళితులు, బలహీనవర్గాలకు దూరం అవడం చేత కొంత బలహీనపడిందని, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటల వంటి కొన్ని నియోజకవర్గాలలో ఆ కారణంగానే ఓడిపోయిందని అన్నారు.
నిజమే! రాష్ట్రపతిగా దళితుడిని నియమించినా ఆ వర్గ ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. కానీ కులమత ప్రభావం చాలా బలంగా ఉన్న మన దేశంలో ఆ వర్గపు ప్రజలను గౌరవించామని చెప్పుకొని రాజకీయ పార్టీలు ఓట్లు దండుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. ఒక గొప్ప ఆశయాన్ని అమలుచేయలేనప్పుడే రాజకీయ పార్టీలు ఇటువంటి షార్ట్ కట్స్ ఉపయోగిస్తుంటాయి.
ఉదాహరణకు డాక్టర్ అంబేద్కర్ చెప్పినవాటిని పాలకులు చిత్తశుద్ధితో పాటించి ఉండి ఉంటే స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళ తరువాత కూడా నేడు బడుగు, బలహీనవర్గాలు ఈ దుస్థితిలో ఉండేవారు కారు. వారికి న్యాయం చేయలేని ప్రభుత్వాలు 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాలను స్థాపించడానికి పోటీలు పడుతున్నాయి. ఆవిధంగా ఆ వర్గాల ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎంత ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేసినా ఆ వర్గాలకు ఏమైనా ఒరుగుతుందా? అంటే లేదని అర్ధం అవుతుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఏ వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టినా కూడా అంతే! అది రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుంది తప్ప ఆ వర్గం ప్రజలకేమీ ఉపయోగపడదు. చివరిగా, ఉత్తం కుమార్ రెడ్డి మాటలు విన్నట్లయితే నేటికీ మన రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలను, దళితులను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నాయని అర్ధం అవుతుంది.