కోదండరామ్ యాత్ర ఉద్దేశ్యం ఏమిటో?

June 22, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ బుధవారం సంగారెడ్డి పట్టణం నుంచి ‘అమరవీరుల స్ఫూర్తియాత్ర’ పేరిట రాష్ట్ర పర్యటన ప్రారంభించారు. ఆ యాత్ర ప్రదానోదేశ్యం ప్రజా సమస్యలను తెలుసుకోవడం, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేయడం అని మొదట చెప్పారు. కానీ యాత్ర మొదటిరోజునే సంగారెడ్డి పట్టణంలో జెఎసి అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మిషన్ భగీరథలో దుబారాను అరికడితే సుమారు 30,000 కోట్లు అదా అవుతుందని, దానితో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించవచ్చని అన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు చెప్పి రైతులను నుంచి బలవంతంగా భూములు గుంజుకొని వాటిని పారిశ్రామికవేత్తలకు, కార్పోరేట్ సంస్థలకు ఉదారంగా పంచి పెడుతోందని కానీ దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి భూమి దొరకడం లేదని చెపుతోందని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. 

తెలంగాణా ఏర్పడినా మెదక్ జిల్లా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తయినా లక్ష ఉద్యోగాల భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతులు అన్ని వర్గాలలో తెరాస సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని అన్నారు. ప్రభుత్వం మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు సాగుతోందని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. 

ప్రొఫెసర్ కోదండరామ్ యాత్ర మొదటిరోజునే తెరాస సర్కార్ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం చూస్తే యాత్ర పూర్తయ్యేవరకు ప్రభుత్వంపై ఆయన దాడి కొనసాగుతుందని స్పష్టం అవుతోంది. ఆయనకు ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించను..వాటిపై నాకు ఏమాత్రం ఆసక్తి లేదని చెపుతున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాదిరిగా అయన స్ఫూర్తి యాత్ర చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విచిత్రంగా ఉంది. అందుకే తెరాస నేతలు కూడా అయన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన ఆ పార్టీ తరపునే తమ ప్రభుత్వంతో ఈవిధంగా యుద్ధం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన ఈ విమర్శలను నేడో రేపో తెరాస నేతలు ధీటుగా తిప్పికొట్టడం ఖాయం. అప్పుడు వారు అనే మొట్ట మొదటి మాట అదే.  


Related Post