అమితాబ్ గారు! దానికి దూరంగా ఉంటే మీకే మంచిది!

June 22, 2017


img

కేంద్రప్రభుత్వం జి.ఎస్.టి. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని అభ్యంతఃరాలు వ్యక్తం చేసినప్పటికీ చివరకు అది కూడా ఆమోదించింది. త్వరలో జి.ఎస్.టి.అమలులోకి వస్తున్నప్పటికీ ఆ నూతన ఏకీకృత పన్ను విధానంపై ప్రజలు, వ్యాపార వర్గాలలో ఇంకా అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. జి.ఎస్.టి. వలన అందరికీ మేలే జరుగుతుంది తప్ప నష్టం జరుగదని కనుక దాని గురించి అనవసర భయాందోళనలు చెందవద్దని ప్రజలకు తెలియజేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రముఖ బాలీవుడ్ నటుదు అమితాబ్ బచ్చన్ చేత ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించేందుకు సిద్దం అవుతోంది. జి.ఎస్.టి.పై ప్రజలలో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను అందరూ స్వాగతిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు అమితాబ్ బచ్చన్ ను విమర్శిస్తోంది.

ఆ పార్టీకి చెందిన సంజయ్ నిరుపమ్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా జి.ఎస్.టి. ప్రవేశపెడుతున్నందున దానిపై చాల గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాటిని చక్కదిద్దకుండా దాని గురించి గొప్పగా ప్రచారం చేయించాలని చూస్తోంది. కనుక అమితాబ్ బచ్చన్ ఈ ప్రచారానికి దూరంగా ఉంటే మంచిది. లేకుంటే ఆయనే ప్రజాగ్రహానికి గురవుతారు,” అని హెచ్చరించారు.

ఏ వ్యవస్థలోనైనా సంస్కరణలు చేస్తున్నప్పుడు తొలుత ఇటువంటి అయోమయ పరిస్థితులు కనబడటం సహజం. కానీ క్రమంగా ఆ కొత్తవిధానాలు, పద్ధతులకు అలవాటు పడుతుంటారు. ఒక మంచి ఆశయంతో ప్రారంభిస్తున్న ఈ జి.ఎస్.టి. విధానం వలన సామాన్యులపై ధరల భారం తగ్గి దేశ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు చెపుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి గొప్ప ఆలోచనలు ఎన్నడూ చేయలేదు. కానీ మోడీ సర్కార్ చేస్తే విమర్శలు గుప్పిస్తోంది. ఈవిధంగా వ్యవహరిస్తునందునే దానిని దేశప్రజలు పక్కన పెడుతున్నారని ఇంకా గ్రహించకపోవడం విచిత్రమే. 


Related Post