హైదరాబాద్ లోటస్ పాండ్ లో నివసించే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మియాపూర్ కంటే ఏపిలో విశాఖనగరమే దగ్గరని భావిస్తున్నట్లున్నారు. మియాపూర్ భూకుంభకోణంపై ఇంతవరకు నోరు విప్పని ఆయన విశాఖ భూకుంభకోణంపై మాత్రం చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. దానిని నిరసిస్తూ ఈరోజు విశాఖలో ధర్నా చేయడానికి బయలుదేరారు.
విశాఖ భూకుంభకోణం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అయన కుమారుడు నారా లోకేష్, మంత్రి గంటా శ్రీనివాసరావుతో బాటు అనేక మంది తెదేపా ఎమ్మెల్యేలు, నేతల హస్తం ఉందని జగన్ ఆరోపిస్తున్నారు. వారు రెవెన్యూ రికార్డులనె ట్యాంపరింగ్ చేసి, వీలుకాకపోతే మాయం చేసి విశాఖలో యధేచ్చగా ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకొంటున్నారని వైకాపా నేతలు పిర్యాదు చేస్తున్నారు. ఈ భూకుంభకోణాలతో ‘స్టీల్ సిటీ’ గా పేరున్న విశాఖను ‘స్టోల్ న్ సిటీ’గా మార్చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణంలో అందరూ తెదేపా పెద్దలే ఉన్నారు కనుక ఈ కేసును అటకెక్కించేందుకే సి.ఐ.డి.విచారణతో సరిపెడుతున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణంపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో కలిసి విశాఖలో జివిఎంసి కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు.
హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్న జగన్ ఏనాడూ తెలంగాణా రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందించరు కానీ ఎన్నికలొస్తే ప్రజల మద్య వాలిపోయి తండ్రి పేరు చెప్పుకొని వాళ్ళను ఓట్లు అడుగుతుంటారు. అది కూడా తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో కాక తన రాజకీయ శత్రువైన తెదేపాను దెబ్బ తీయడానికేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. తెలంగాణాపై ఏమాత్రం ఆసక్తిలేని అటువంటి నేతను, పార్టీని నమ్ముకొని తెలంగాణాకు చెందిన కొందరు నేతలు వైకాపాలో చేరి తమ రాజకీయ జీవితాలను కూడా అంధకారంగా మార్చుకొంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. కొండా సురేఖ దంపతులకు వైకాపాలో ఎదురైన చేదు అనుభవమే అందుకు ఉదాహరణ అని వారు చెపుతుంటారు.