తెరాస సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పధకంపై మొట్టమొదటగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు.
ఆయన బుధవారం సచివాలయంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్పి. సింగ్ ను కలిసి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి బయట కాలుపెట్టరు. కనీసం సచివాలయానికి కూడా రారు. అది కూడా ఏదో ఒకరోజు మియాపూర్ భూములలాగే కబ్జా అయిపోతుందనుకొంటున్నారేమో? చంద్రబాబు నాయుడుని అడిగితే అపాయింట్ మెంట్ ఇస్తారేమో కానీ కేసీఆర్ అపాయింట్ మెంట్ మాత్రం ఎన్నడూ దొరకదు. నిత్యం ఏదో మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టడమే ఆయన పని. ఈ గొర్రెల పధకంతో ప్రజలకు అరచేతిలో వైకుంటం చూపిస్తున్నారు. కానీ నిజానికి అది గొర్రెల స్కీం కాదు. గొర్రెల స్కాం. తెరాస సర్కార్ ఏ పని మొదలుపెట్టినా దానిలో తప్పకుండా స్కాం ఉంటుంది. ఏదో ఒక ప్రాజెక్టు, స్కీం పేరు చెప్పి దొరికినంత అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేస్తున్నారు. ఆయన మొదలుపెడుతున్న వాటివలన చివరికి రాష్ట్రానికి అప్పులే మిగులుతాయి. ఇదేవిధంగా పరిపాలన సాగితే మరో ఐదారేళ్ళ తరువాత వచ్చిన ఆదాయం అంతా అప్పులు తీర్చుకోవడానికే సరిపోతుంది,” అని ఎద్దేవా చేశారు.
కోమటిరెడ్డి విమర్శలకు తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ వెంటనే స్పందించారు. “కాంగ్రెస్ నేతలకు స్కాములు తప్ప స్కీముల గురించి తెలియదు. పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనబడినట్లే వాళ్ళకీ అన్నిటిలో స్కాములే కనిపిస్తుంటాయి. నిజానికి కాంగ్రెస్ నేతలతో అత్యధికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసింది కోమటిరెడ్డే. కానీ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ దొరకడం లేదంటాడు. ఆయన ఈ మూడేళ్ళలో 391 మందికి సిఫార్సు చేయగా వారందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేసినమాట వాస్తవమా కాదా కోమటిరెడ్డి చెప్పాలి. మా ప్రభుత్వం ఏ మంచిపని మొదలుపెట్టినా దానిని విమర్శించడం, నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ నేతల పనిగా పెట్టుకొన్నారు. వారికి ప్రజలే తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.