జైట్లీ అన్నిటికీ బుర్ర ఊపారు కానీ..

June 21, 2017


img

మరొక 9 రోజులలో దేశమంతట జి.ఎస్.టి. అమలులోకి వస్తుంది. రాష్ట్రంలో బీడీ, గ్రానైట్ పరిశ్రమలపై జి.ఎస్.టి. తగ్గించమని ఆర్ధికమంత్రి ఈటెల చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ మళ్ళీ నిన్న అరుణ్ జైట్లీని కలిసి పరిస్థితులను వివరించడంతో వాటిపై సానుకూలంగా స్పందించారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, భగీరథ, పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పధకాలను కూడా జి.ఎస్.టి. నుంచి మినహాయించాలని లేదా నామమాత్రంగా పన్ను విధించాలని కోరారు. దానికీ ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక జి.ఎస్.టి. విధానం అమలులోకి వచ్చేలోగానే రాష్ట్రానికి సి.ఎస్.టి. ద్వారా రావలసిన రూ.350 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి చెల్లించవలసిన రూ.450 కోట్లు కూడా విడుదల చేయాలన్న కేటిఆర్ విజ్ఞప్తికి జైట్లీ సానుకూలంగా స్పందించారు. 

ఇక 14వ ఆర్ధిక సంఘం సిఫారుసుల మేరకు రాష్ట్ర జిడిపిలో 3.5శాతం మేరకు ఎఫ్.ఆర్.బి.ఎం.విధానం ద్వారా ఆర్ధిక సంస్థల నుంచి రుణం పొందేందుకు తెలంగాణా అర్హత కలిగి ఉంది కనుక అందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేటిఆర్ కోరగా జైట్లీ దానికి కూడా సానుకూలంగా స్పందించారు. జి.ఎస్.టి.పై తెలంగాణా ప్రభుత్వం కోరుతున్న తగ్గింపు, మినహాయింపు చాలా సహేతుకంగా ఉన్నందున, లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లయితే జి.ఎస్.టి. కొన్సిల్ లో చర్చించి వాటిపై నిర్ణయం తీసుకొంటామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. 

తెలంగాణా రాష్ట్రం నుంచి కేంద్రానికి వస్తున్న ఆదాయం కంటే రాష్ట్రానికి ఇస్తున్నది చాలా తక్కువని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రం నుంచి బారీగా ఆదాయం తీసుకొంటున్నప్పుడు, న్యాయంగా దానికి చెల్లించవలసిన బకాయిలను విడుదల చేయడం లేదు. దాని కోసం కూడా డిల్లీ చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా ప్రదక్షిణాలు చేయవలసి వస్తోంది. రాష్ట్రం నుంచి ఎవరు వెళ్ళి కలిసినా అరుణ్ జైట్లీ ఎప్పుడూ సానుకూలంగానే స్పందిస్తుంటారు. కానీ ఆచరణలో మాత్రం ఆ సానుకూలత కనిపించదు. ఇప్పుడు కూడా అయన అలాగే స్పందించారు. కానీ వాటిలో ఎన్నిటిని, ఎప్పటిలోగా నెరవేర్చుతారో ఎవరికీ తెలియదు.


Related Post