గొర్రెల పంపిణీ ఆచరణ సాధ్యమేనా?

June 21, 2017


img

తెలంగాణా ప్రభుత్వం నిన్న అట్టహాసంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పధకంపై అప్పుడే మేధావులు పెదవి విరుస్తున్నారు. అది ఆచరణ సాధ్యంకాదని కనుక అది కూడా మిగిలిన హామీలలాగే నీటి మీద రాతలాగ మిగిలిపోయే అవకాశం ఉందని చెపుతున్నారు. వారి వాదన ఈవిధంగా ఉంది.

రాష్ట్రంలో 7.15 లక్షల గొల్ల, కురుమలను లబ్దిదారులుగా గుర్తించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఒక్కొక్కరికీ 21 గొర్రెలు చొప్పున 75 శాతం సబ్సీడిపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ ఏడాది 3.50 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే 21X3.50=73.5 లక్షల గొర్రెలు అవసరం అన్నమాట. (అదే 7.15 లక్షల మందికి పంపిణీ చేయలంటే ఒక కోటి ఏబై ఏడు లక్షల గొర్రెలు అవసరం.) అయితే ఇరుగుపొరుగు రాష్ట్రాలలో సుమారు 10-20 లక్షల గొర్రెలకంటే ఎక్కువ లేవు. యూపి, మధ్యప్రదేశ్, చత్తిస్ ఘడ్,  బిహార్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోదలచినా మరో 10 లక్షల కంటే ఎక్కువ సమీకరించడం కష్టం. పైగా ఆ రాష్ట్రాలకు కూడా గొర్రెలు అవసరం కనుక అవి తమ వద్ద ఉన్న అన్ని గొర్రెలను తెలంగాణాకు ఇచ్చేందుకు అంగీకరించవు. 

ఒకవేళ గొర్రెలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న అన్ని రాష్ట్రాలలో కలిపి 40 లక్షలు గొర్రెలు ఉన్నాయనుకొంటే, వాటిలో సగం అవసరాలకు ఉంచుకొంటాయి. మిగిలిన 20 లక్షల గొర్రెలను తెలంగాణాకు ఇచ్చేసినా, ప్రభుత్వం చెపుతున్నట్లుగా ఈ ఏడాదిలో 73.5 లక్షల గొర్రెలు పంపిణీ చేయడం సాధ్యం కాదు. కనుక మళ్ళీ గొర్రె పిల్లలు పుట్టి అవి పెరిగేవరకు ఎదురు చూడకతప్పదు. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ సదుద్దేశ్యంతోనే ఈ పధకం ప్రారంభించినప్పటికీ ఇది ఆచరణ సాధ్యం కాదని మేధావులు వాదిస్తున్నారు. 

ఇక రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలకు సరిపడినంత ఆహారం దొరకకపోవడం చేత యజమానులు వాటిని కబేళాలకు అమ్ముకొంటున్నప్పుడు కొత్తగా మరో 73.5 లక్షల గొర్రెలను తెస్తే వాటికి ఆహారం ఎక్కడ నుంచి తెస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. 

అదేవిధంగా పశువైద్యశాలలలో పశువైద్యులు, సిబ్బంది ఉద్యోగాల భర్తీ చేయమని అర్హులైన అభ్యర్ధులు, నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ పట్టించుకోనప్పుడు 100 పశువైద్య అంబులెన్స్ లలో పనిచేసేందుకు వైద్యులను, సిబ్బందిని వారికి అవసరమైన మందులు, పరికరాలను ఏర్పాటు చేస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మేధావులకు రాజకీయాలతో సంబంధమ లేదు కనుక వారు ఈ పధకంలో లోపలాను మాత్రమే ఎత్తి చూపించి ఊరుకొన్నారు. కానీ వారు చెపుతున్న ఈ కారణాలనే ప్రతిపక్షాలు అందిపుచ్చుకొంటే వారి వాదన మరొక రకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ఇటువంటి ఆచరణ సాధ్యంకాని హామీలు, పధకాలను ప్రకటిస్తున్నారని విమర్శలు గుప్పించడం ఖాయం. కనుక తెలంగాణా ప్రభుత్వం మేధావులు చెపుతున్న ఈ విషయాలపై లోతుగా అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనడమో లేదా ఇప్పుడే ఈ పధకంలో అవసరమైన మార్పులు చేర్పులు చేయడమో చేస్తే మంచిదేమో! లేకుంటే ఒక మంచి పనిమొదలు పెట్టి అది చేయలేకపోయినందుకు తెరాస సర్కార్ విమర్శలు మూటగట్టుకోవలసి వస్తుంది. 


Related Post