ఈరోజు సిద్ధిపేట జిల్లా, కొండపాకలో ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తూ, తన ప్రసంగంలో ప్రతిపక్ష నేతలకు భలే చురకలు వేశారు. “నేను గొల్లకురుములకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు చెప్పగానే మన ప్రతిపక్ష నేతలు కొందరు అవహేళనగా నవ్వారు. కానీ ఆ గొర్రెలకేమి అర్ధం అవుతాయి ఈ గొర్రెల లెక్కలు?” అని అన్నారు.
సామాన్యులకు సైతం చాలా సులభంగా అర్ధమయ్యే విధంగా ఆయన గొర్రెల లెక్కలు విడమరిచి చెప్పారు. “మన రాష్ట్రంలో రోజుకు సుమారు 650 లారీల గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకొంటున్నాము. మన రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకంలో ఆరితేరిన లక్షలాది గొల్ల కురుమలను ఉంచుకొని కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు గొర్రెలు దిగుమతి చేసుకొంటున్నాము. మకన అవసరాలకు సరిపడినన్ని గొర్రెలను మనమే ఎందుకు ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాము? అని గత పాలకులు ఎవరూ ఆలోచించలేదు. ఎందుకంటే వారెవరికీ తెలంగాణాపై ఏమాత్రం ఆసక్తి లేదు కనుక. నేను తెలంగాణా కోసం పోరాటం మొదలుపెట్టిన కొత్తలో చాలా మంది తెలంగాణా ఇస్తే నువ్వేమి చేసుకొంటావు అని వెటకారంగా అడిగేవారు. వారికి ఇదే చేసుకొంటామని ఇప్పుడు సమాధానం చెపుతున్నాను.
ఈ ఏడాది సుమారు కోటి గొర్రెలను పంపిణీ చేస్తున్నాము. అవి రెండేళ్లలో మూడుసార్లు ఈనుతాయి. అంటే రాగల మూడేళ్ళలో అవి దాదాపు మూడు నుంచి ఐదురెట్లు పెరుగుతాయన్న మాట. ఒక్కొక్క గొర్రె రూ.5,000 అనుకొంటే ఐదుకోట్ల గొర్రెలకు ఎంత ఆదాయం వస్తుందో ఊహించుకోవచ్చు. వాటిలో కొన్ని అట్టేబెట్టుకొని మిగిలినవి అమ్ముకొన్నా మన గొల్లకురమన్నలకు రూ.20,000 కోట్లు ఆదాయం సమకూరుతుందన్న మాట. మనం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకొంటున్నాము. కానీ మరో రెండేళ్ళ తరువాత మనమే రోజుకు 6,000 లారీల గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే స్థాయికి ఎదుగుతాము. ఇది కేసీఆర్ చెపుతున్న మాట! మీరందరూ కలిసి ఈ పధకాన్ని విజయవంతం చేసి, నన్ను గెలిపించాలి. నా ఈ ఆలోచనలు, లెక్కలు నిజమేనని నిరూపించాలి. ఆ బాధ్యత మీదే,” అని అన్నారు.