తెలంగాణాలో నిరుపేద గొల్లకురుమ యాదవుల జీవితాలలో వెలుగులు నింపే మరో అద్భుతమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో 3,60,098 మందికి శాశ్విత జీవనోపాధి కల్పించేందుకు రూ.400 కోట్లతో గొర్రెలను పంపిణీ చేయబోతున్నారు. ఒక్కొక్కరికీ 75శాతం సబ్సీడీపై 20 గొర్రెలు, ఒక్క పొట్టేలు చొప్పున అందజేస్తారు. మళ్ళీ వచ్చే ఏడాది మరో 3,57,971 మందికి ఇదేవిధంగా గొర్రెలు అందజేస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు గజ్వేల్ లోని కొండపాకలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే సమయంలో హైదరాబాద్ తప్ప 30 జిల్లాలలో కూడా మంత్రులు,ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు తదితరులు లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తారు. ఒక్కో యూనిట్ కు 21 గొర్రెలు చొప్పున మొత్తం 1500 యూనిట్లను నేడు పంపిణీ చేస్తారు.
ఈ పధకంపై కూడా ప్రతిపక్షాలు యధాప్రకారం విమర్శలు గుప్పించాయి. దశాబ్దాలుగా నిరాదారణకు గురవుతున్న గొల్లకురుమ యాదవులకు చదువుకొని సమాజంలో మిగిలిన వర్గాల ప్రజలతో సమానంగా ఎదిగే అవకాశం కలిపించే ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి వారిని గొర్రెలు కాసుకొమ్మని చెప్పడం సరికాదని విమర్శిస్తున్నాయి. కానీ గొల్లకురుమల పిల్లలను గొర్రెలు కాసుకోమని కేసీఆర్ ఏనాడూ చెప్పలేదు. అటువంటి వారి కోసమే ప్రభుత్వ హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు వాటిలో మధ్యాహ్న భోజనాలు వగైరాలన్నీ ఉన్నాయి.
అదే సమయంలో గొల్లకురుముల వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విప్లవాత్మక నిర్ణయం అమలుచేస్తున్నారని చెప్పవచ్చు. పేదరికం, దారిద్ర్యంతో బాధపడుతున్నవారందరికీ ముందుగా ఉపాది మార్గం చూపించి వారి బాధల నుంచి విముక్తి కల్పించినప్పుడే వారు చదువు, ఉద్యోగాల గురించి ఆలోచించగలుగుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ భావన కావచ్చు. కనుకనే ఇంత బారీ స్థాయిలో ఈ పధకాన్ని ప్రారంభిస్తున్నారు.
ఈ పధకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలుచేయగలిగితే వారందరి జీవితాలలో వెలుగులు నిండుతాయి. అదే సమయంలో రాష్ట్రంలో మాంసం ఎగుమతులు కూడా పెరిగి రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. దాని వలన అటువారికి, ప్రభుత్వానికి కూడా చాలా మేలు కలుగుతుంది. కనుక ఇటువంటి మంచి గొప్ప ఆలోచన చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందించాలి తప్ప విమర్శించడం సరికాదు.