సింగరేణి సమ్మెలో కొత్త మలుపు?

June 19, 2017


img

నేటితో సింగరేణి సమ్మె 5 రోజులు పూర్తయింది. సమ్మెను విచ్చినం చేయడానికి సింగరేణి యాజమాన్యం విశ్వప్రయత్నాలు చేస్తోందని సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే వారసత్వ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీ లభించేవరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తమ సమ్మెను విచ్చినం చేయడానికి సింగరేణి యాజమాన్యం కుట్రలు పన్నుతున్నందున వారు కూడా సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి పెంచడానికి వ్యూహం మార్చాలని నిర్ణయించారు. త్వరలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించాలని నిర్ణయించారు. తమ భార్యపిల్లలను కూడా దీక్షలలో కూర్చోబెట్టాలని అనుకొంటున్నారు.

తాము లేవనెత్తిన సమస్యలను సింగరేణి యాజమాన్యం పరిష్కరించే ప్రయత్నం చేయకుండా సమ్మెను విచ్చినం చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపుతోందని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమ్మెలో జాతీయ పార్టీల అనుబంద సంఘాలన్నీ పాల్గొంటునందున, తమతమ రాష్ట్ర, జాతీయ రాజకీయ నేతలను కూడా రప్పించి సమ్మెను మరింత ఉదృతం చేయడానికి ముమ్మురప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్, భాజపా, తెదేపా, వామపక్ష నేతలు, టిజెఎసి నేతలు  సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల నేతలను కలిసి తమ మద్దతు ప్రకటించారు. కనుక సమస్య పరిష్కారం కానట్లయితే సమ్మె ఇంకా ఉదృతం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి తప్ప విరమించే సూచనలు కనబడటం లేదు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కార్మికుల న్యాయమైన డిమాండ్ వారసత్వ ఉద్యోగాల కల్పనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. లేకుంటే అందరూ నష్టపోతారు.  


Related Post