తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ రైతుకు ఎకరానికి రూ.4,000 చొప్పున కరీఫ్, రబీ రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8,000 చొప్పున చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని కోసం ప్రభుత్వం నియమించిన వ్యవసాయ విస్తరణాధికారులు గత నెల రోజులుగా రాష్ట్రంలో రైతులందరి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 83 శాతం మంది అంటే 46,17,292 మంది రైతుల వివరాలను నమోదు ప్రక్రియ పూర్తయింది. కనుక మిగిలిన 17 శాతం రైతుల వివరాల సేకరణ కూడా త్వరలోనే పూర్తవుతుంది. అది పూర్తయితే వారి వివరాలతో వ్యవసాయ శాఖలో ఒక డాటా బ్యాంక్ ఏర్పాటు చేయబడుతుంది. దాని ఆధారంగానే వచ్చే ఏడాది నుంచి మే నెల నుంచి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతలలోకే నగదు జమా అవుతుంది.
రాష్ట్రంలో ఇంతవరకు 46,17,292 మంది రైతుల వివరాలు నమోదు చేసుకొన్నారు. ఆ లెక్కన ఒక్కో రైతుకు కేవలం ఒక్క అర ఎకరమే ఉందనుకొన్నా ప్రభుత్వం వారికి ఏడాదికి రూ.185 కోట్లు చెల్లించవలసి ఉంటుంది. కానీ వాస్తవానికి ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్నవారు కొన్ని వేలమంది రైతులున్నారు. అలాగే 10-15 ఎకరాలున్న మోతుబారులు చాలా మందే ఉన్నారు. ఆ లెక్కన వారందరికీ ఎకరానికి రూ.8,000 చొప్పున చెల్లించడం సాధ్యమేనా? ఆలోచించవలసి ఉంది.
ఇక ఈ పధకంలో చేరేందుకు ప్రభుత్వం ఎటువంటి భూపరిమితి విదించలేదు కనుక 10-20 సెంట్లు భూమి ఉన్న సన్నకారు రైతు మొదలు 10-15ఎకరాలు భూమి ఉన్న పెద్ద రైతు కూడా అర్హుడే. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యవసాయం చేస్తున్నారు కనుక ఆయన కూడా ఈ పధకానికి అర్హుడే అవుతారు. కనుక ఆయనకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుంది. ఇది వింటేనే ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్ధం అవుతుంది. రైతులకు మేలు చేయాలనే ప్రభుత్వ ఆలోచన అభినందనీయమే. అయితే ఇది రాష్ట్రంలో ధనిక రైతులకు కూడా వర్తింపజేయడం సరికాదు.
ఒక్కో రైతుకు ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.8,000 అందిస్తే, 10ఎకరాలున్న రైతుకు ఏడాదికి రూ.80,000 అందితే అర ఎకరం ఉన్న రైతుకు ఏడాదికి రెండు పంటలకు కలిపి కేవలం రూ.4,000 మాత్రమే అందుతుంది. అంటే ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత ఎక్కువ లబ్ది కలుగుతుందన్నమాట! నిజానికి పేద రైతులకే ఎక్కువ ఆర్ధిక సహాయం అందించడం అవసరం. కానీ ఈ పద్దతిలో పేదరైతులకు తక్కువ, మోతుబారి రైతులకు బారీగా డబ్బు అందుతుందన్న మాట. ప్రభుత్వ సహాయం అవసరం లేనివారికి కూడా ఆర్ధిక సహాయం చేయాలనుకోవడం వలన ప్రభుత్వంపై ఆర్ధిక భారం పెరుగుతుంది తప్ప పేద రైతులను ఆదుకోవాలనే దాని ఆశయం ఫలించదు.
కనుక ఈ పధకాన్ని 5 ఎకరాలలోపు భూమి ఉన్నవారికే వర్తింపజేస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితం కనబడుతుంది. లేకుంటే గొప్ప ఆశయంతో ప్రారంభిస్తున్న ఈ పధకం ఏదో ఒకరోజు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రభుత్వం ఈ పధకాన్ని అమలుచేసే ముందు నిరుపేద రైతులనే ప్రామాణికంగా తీసుకొని ఈ పధకానికి మెరుగులు దిద్దితే రైతన్నలకు ఎక్కువ మేలు కలుగుతుంది లేకుంటే ఏదో ఒకరోజున ఈ పధకం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంటుంది.