పేరు చెప్పకుండా మద్దతు కోరితే ఎలా?

June 16, 2017


img

ఈరోజు ఉదయం కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్ ఇద్దరూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి వెళ్ళి ఆమెను కలిసారు. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఈయవలసిందిగా వారు కోరారు. అయితే వారు కాంగ్రెస్ మద్దతు కోరుతున్నప్పటికీ తమ అభ్యర్ధి పేరు చెప్పకపోవడంతో సోనియా గాంధీ వారికి ఎటువంటి హామీ ఇవ్వలేనని చెప్పి పంపించేశారు. "మీ అభ్యర్ధి ఎవరో చెప్పకుండా గోప్యత పాటిస్తున్నప్పుడు మీరు ఏవిధంగా మా మద్దతు ఆశిస్తున్నారు?" అని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. 

ఇక ఈరోజు మరో ఆసక్తికరమైన వార్త వినిపించింది. భారత్ మెట్రో పితామహుడు, ఇండియా మెట్రో మ్యాన్ అని పేరు సంపాదించుకొన్న ఈ. శ్రీధరన్ ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టబోతోందనే వార్తలు వినిపించడంతో వాటిని ఆయన తక్షణం ఖండించారు. తనకు అటువంటి ఆలోచనలు లేవని ఎవరూ తనను సంప్రదించలేదని చెప్పారు.

అయితే ఎన్డీయే తరపున విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె మంచి సమర్దురాలైన, తెలివైన మహిళామంత్రి కావడం, దేశవిదేశాల ప్రభుత్వాలతో ఆమెకు చక్కటి పరిచయాలు ఉండటం, ప్రతిపక్షాల నేతలతో కూడా చక్కటి సంబంధాలు కలిగి ఉండటం ఆమెకు సానుకూల అంశాలుగా ఉన్నాయి.

హరితవిప్లవ పితామహుడు, నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాథన్ పేరు కూడా వినిపిస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే ఆయన పేరును సూచిస్తున్నారు. 


Related Post