పశువధ ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరారణ

June 15, 2017


img

దేశంలో ఆవులు, ఎద్దులు, గేదెలు, ఒంటెలను మాంసం కోసం అక్రమంగా అమ్మకాలు, కొనుగోళ్ళు చేయడం, వాటిని వధించడాన్ని నిషేధిస్తూ గత నెల 23న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ హైదరబాద్‌కు చెందిన అల్ ఇండియా జామైతుల్ ఖురేష్ యాక్షన్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు తిరస్కరించింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించి, ఈ కేసు విచారణను జూలై 11కు వాయిదా వేసింది. 

పశువధ నిషేదాన్ని భాజపా పాలిత రాష్ట్రాలు కూడా గట్టిగా అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, మణిపూర్ తదితర ఈశాన్య రాష్ట్రాలు కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. భాజపాకు మిత్రపక్షంగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న  ఏపిలో తెదేపా సర్కార్ ఉన్న ఈ విషయం గురించి అసలు మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. అందుకు కారణం పశుమంసం ఎగుమతులలో దేశంలో ఏపి రెండవ స్థానంలో ఉండటమే. ఇక కొన్ని రాజకీయ పార్టీలు దీనిని గట్టిగా వ్యతిరేకిస్తుండగా మరికొన్ని ఓటు బ్యాంకు ను దృష్టిలో ఉంచుకొని తమ వైఖరిని తెలియజేసేందుకు సంకోచిస్తున్నాయి.

ఇక గోసంరక్షణను గట్టిగా సమర్ధిస్తున్న హిందువులు సైతం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం అనేకమంది హిందువులు ఆవులు, ఎద్దులను పూజిస్తుంటే అనేక మందికి ‘బీఫ్’ తినే అలవాటు ఉండటమే. పశువధను మతంతో ముడిపెట్టి నిషేధం విధించడం ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమేనని కొందరు మేధావులు వాదిస్తున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లను, కట్టుబొట్టు అన్నిటినీ ప్రభుత్వం నియంత్రించాలను కోవడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు. దీనిపై పార్లమెంటులో బయటా లోతైన చర్చ జరుపవలసిన అవసరం ఉంది.   



Related Post