ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ భూముల కొనుగోలు వ్యవహారంలో తెరాస రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు పరిస్థితి అయోమయంగా మారినట్లు కనిపిస్తోంది. మొదట ఆ (ప్రభుత్వ) భూముల కొనుగోలులో తాను ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని గట్టిగా వాదించిన ఆయన ఇప్పుడు మాట మార్చి వివాదాస్పదమైన ఆ భూములను తనకు అంటగట్టినవారికి లీగల్ నోటీసులు ఇస్తానని చెప్పడం విశేషం. వాటి కోసం తాను చెల్లించిన మొత్తం డబ్బు, దానికి పెనాల్టీతో సహా తిరిగి చెల్లించాలని కోరుతూ సదరు వ్యక్తులకు త్వరలో లీగల్ నోటీసులు ఇస్తానని చెప్పారు. అంటే ఆ భూములు వివదస్పదమైనవని ఆయనే ఇప్పుడు స్వయంగా అంగీకరిస్తున్నారన్న మాట. కానీ మూడు రోజుల క్రితం అవి ఎటువంటి వివాదమూ లేని భూములని దృవీకరించుకొన్న తరువాతనే వాటికి డబ్బు చెల్లించి చట్టబద్దంగా కొనుకొన్నానని కేశవరావు స్వయంగా మీడియాకు చెప్పారు. అందుకు సాక్ష్యంగా అనేక డాక్యుమెంట్లు, కోర్టు తీర్పు కాపీలను కూడా ఆయన చూపించారు.
ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందునే ఆయన ఈవిధంగా మాట మార్చి మాట్లాడుతున్నట్లు భావించవచ్చు. ఇక తెరాస ప్రభుత్వమే స్వయంగా ఉద్దేశ్యపూర్వకంగానే కేశవరావు భూబాగోతాన్ని మీడియాకు లీక్ చేసిందని ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన ఆరోపణలపై తెరాస నేతలు మండిపడుతున్నారు. కానీ ఆ ఆరోపణలు ఈ వ్యవహారంలో మరో కోణం కూడా దాగి ఉందని సూచిస్తున్నట్లుంది. ఒకవేళ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపణలు నిజమయితే కేశవరావుకు పార్టీలో పొగ మొదలైనట్లే భావించవచ్చు. ఇక కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన డి.శ్రీనివాస్ కూడా 4 ఎకరాల అసైన్డ్ భూములను కొన్నారు. వాటిపై మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన ఇంకా స్పందించలేదు.