యూపియే సరే..మరి ఎన్డీయే ఏమి చేసింది?

June 13, 2017


img

యూపియే హయంలో రోజుకొక కొత్త కుంభకోణం తప్ప మరేమీ జరుగలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కానీ మూడేళ్ళ మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ వినపడలేదు..ఒక్క కుంభకోణం కూడా జరుగలేదని చెప్పారు. నిజమే! కానీ ఇప్పుడు ఎన్డీయే హయంలో అవినీతికి బదులు హిందుత్వ పిడివాదం దేశప్రజల నెత్తిన బలవంతంగా రుద్దుడు కార్యక్రమం చాలా జోరుగా సాగిపోతోంది. ఆ దిశలో మోడీ సర్కార్ తీసుకొంటున్న కొన్ని నిర్ణయాలతో దేశంలో హిందూ, ముస్లింల మద్య కనబడని విభజనరేఖలు గీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇక ప్రచార యావకి మోడీతో సహా దేశంలో ఏ రాజకీయనాయకుడు అతీతుడుకాదనే సంగతి అందరికీ తెలుసు. నిజానికి రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకుడు ఫోటోల కోసం వెంపర్లాడనక్కర లేదు. ఆయన బయట కనబడితే చాలు ప్రతీ ఒక్కరూ ఫోటోలు తీసుకోవాలని చూస్తారు. కనుక అందుకు ఆయనను నిందించడం తప్పు. 

ఇక వ్యవసాయ రంగానికి మోడీ సర్కార్ ఏమి మేలు చేసిందో తెలియదు కానీ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు సైతం డిల్లీలో రెండు నెలలు ధర్నాలు చేసిన తమిళరైతుల వంక కన్నెత్తిచూడలేదనే సంగతి అందరికీ తెలుసు. తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాలలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర రాక ధర్నాలు చేసినా, ఆత్మహత్యలు చేసుకొన్నా పట్టించుకోలేదు. ఒకవేళ మోడీ సర్కార్ రైతులకు చాలా మేలు చేసి ఉండి ఉంటే నేటికీ దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు? 

రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పంట రుణాల మాఫీ చేయాలనే హామీలు ఇవ్వడం దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీస్తుందని ఒకవైపు ఆర్.బి.ఐ., స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తున్నా కూడా యూపిలో భాజపా అధికారంలోకి రావడం కోసం పంట రుణాల మాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాలలో సైతం పంట రుణాలు మాఫీ చేయక తప్పనిసరి పరిస్థితి కల్పించుకొంది. ఇప్పుడు ఆ భారం రాష్ట్రాలే మోయాలని చెపుతోంది. 

ఇలాగ చెప్పుకొంటూపోతే చాలానే కనబడతాయి. ఏ ప్రభుత్వమయితే సామాన్య ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరుస్తుందో అదే నిజమైన ప్రభుత్వం అవుతుందని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గ్రహిస్తే బాగుంటుంది. 


Related Post